నాంపల్లి: ఏపీకి కేటాయించిన తెలంగాణ ఉద్యోగులను వెనక్కి రప్పించడంలో టీఎన్జీఓ పూర్తిగా వైఫల్యం చెందిందంటూ తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగులు, ఎన్జీఓలు సోమవారం నాంపల్లిలోని టీఎన్జీఓ కేంద్ర కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులందరినీ పావుగా వాడుకున్నారని, ఇప్పుడు అన్యాయం జరిగితే ఏ మాత్రం పట్టించుకోవడం లేదంటూ టీఎన్జీఓ కార్యాలయం గేటు తాళాలు పగులగొట్టారు. వెంట తెచ్చుకున్న పెట్రోలు బాటిల్స్‌తో కార్యాలయంలోనికి చొరబడ్డారు. కార్యాలయం పైకి చేరుకుని తమకు న్యాయం చేయకపోతే ఆత్మాహుతి చేసుకుంటామని హెచ్చరించారు. టీఎన్జీఓ కేంద్ర సంఘం నేతలు వెంటనే రావాలంటూ భవనం పై నుంచి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఉదయం 6 గంటలకే అక్కడికి చేరుకొని 8.45 గంటలకు గేటు తాళాలు పగులగొట్టారు. నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం నేత కె.రాజు, ధన్‌రాజ్ గౌడ్, సత్యనారాయణ, రావు, మురళిలతో పాటుగా మరో 40 మంది ఉద్యోగులు అక్కడ ఉన్నారు. కార్యాలయంలో బైఠాయించి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కారవుతాయంటూ ఉద్యోగులందరినీ కలుపుకుని ఉద్యమాలు చేసిన ఉద్యోగ సంఘ నేతలు ఇప్పుడెక్కడికి పోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాటం చేసిన వాళ్లకు అన్యాయం జరిగితే మాకేం సంబంధం లేదంటారా అంటూ నిలదీశారు. ఏ ఒక్క ఉద్యోగికీ అన్యాయం జరగనివ్వమంటూ ప్రగల్బాలు పలికిన సీఎం కేసీఆర్ ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదంటూ నిట్టూర్చారు. ఫ్రెండ్లీ ప్రభుత్వమంటే ఇదేనా అని ప్రశ్నించారు. అక్కడికి చేరుకున్న టీఎన్జీఓ నేతలు ఆందోళనను విరమించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామి ఇస్తే తప్ప తాము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని భీష్మించుకుని కూర్చున్నారు. నేతలతో వాగ్వాదానికి దిగారు. ఈ విషయాన్ని ఎట్టకేలకు టీఎన్జీఓ కేంద్ర సంఘం నాయకులు రాష్ట్ర మంత్రి కేటీఆర్ దష్టికి తీసుకెళ్లారు. కేటీఆర్ న్యాయం చేస్తానంటూ హామి ఇవ్వడంతో ఆందోళనను విరమించుకున్నారు. దసరా కానుకగా ఏపీ ఉద్యోగులను వెనక్కి రప్పిస్తామని హామీ ఇచ్చినట్లు కేంద్ర సంఘం నేతలు మీడియాకు వెల్లడించారు. అనంతరం పలు ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి మంత్రి కేటీఆర్‌ను కలిసి రెండు దఫాలుగా చర్చలు జరిపారు.
త్వరలో తీసుకువస్తాం: కారం రవీందర్‌రెడ్డి
ఏపీకి కేటాయించిన అనేకమంది ఉద్యోగులను ఇప్పటికే చాలామందిని రాష్ట్రానికి తీసుకువస్తామని, మిగతా 700 మందిని కూడా త్వరలో తెస్తామని టీఎన్జీఓ కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు కారం రవీందర్‌రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. అంతలోనే కొందరు ఉద్యోగులు టీఎన్జీఓ కేంద్ర సంఘం కార్యాలయం ముందు ఆందోళన చేపట్టడం సరికాదన్నారు. కమలనాధన్ కమిటీ అశాస్త్రీయంగా ఉద్యోగ విభజన చేసిందన్నారు.
వారిని రప్పించాల్సిందే
Published Mon, Sep 19 2016 11:44 PM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM
Advertisement
Advertisement