వందల కోట్లు ఖర్చవుతున్నా.. | Can cost several hundreds of crores .. | Sakshi
Sakshi News home page

వందల కోట్లు ఖర్చవుతున్నా..

Published Wed, Jun 18 2014 12:35 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 AM

వందల కోట్లు ఖర్చవుతున్నా..

వందల కోట్లు ఖర్చవుతున్నా..

గ్రేటర్‌లోని రహదారుల కింద వివిధ ప్రాంతాల్లో దాదాపు 30 పెద్ద నాలాలున్నట్లు అంచనా. ఇవి 60 కి.మీ.ల మేర ఉన్నాయనే అంచనాలు తప్ప కచ్చితంగా ఎక్కడున్నాయో తెలియదు.

30 నాలాలున్నా వివరాల్లేవు..
 
గ్రేటర్‌లోని రహదారుల కింద వివిధ ప్రాంతాల్లో దాదాపు 30 పెద్ద నాలాలున్నట్లు అంచనా. ఇవి 60 కి.మీ.ల మేర ఉన్నాయనే అంచనాలు తప్ప కచ్చితంగా ఎక్కడున్నాయో తెలియదు.  ఆయా నాలాల వల్ల సమీప రహదారులకు ప్రమాదం పొంచి ఉంది.. ఎప్పటికప్పుడు తగిన తనిఖీలు, అవసరమైన చర్యల్లేనందువల్లే  రెండే ళ్లక్రితం నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి వద్ద, నెక్లెస్‌రోడ్డు మార్గాల్లో రహదారులు కుంగిపోయాయి. మోడల్‌హౌస్ వద్ద రోడ్డు కుంగడానికి వరదనీటి కాలువలో డైనేజీ నీరు  పొంగి ప్రవహించడమే కారణమని అప్పట్లో భావించారు.సివరేజీకి చాలినన్ని లైన్లు లేకపోవడంతో చాలావరకు సివరేజి కూడా వరదనీటికాలువల్లో కలుస్తోందని  తెలిసినప్పటికీ, ఇటు జీహెచ్‌ఎంసీ కానీ.. అటు వాటర్‌బోర్డు కానీ తగిన చర్యలు తీసుకోలేదు. రెండింటి మధ్య సమన్వయం అసలే లేదు.
 
రోడ్లదీ అదే దుస్థితి ..

నగరంలో ఎన్ని బీటీ రోడ్లున్నాయి..   ఏ రోడ్డు బలమెంత..?  అంటే  వెంటనే సమాధానం చెప్పగలిగే స్థితిలో జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు లేరు. ఈ పరిస్థితిని నివారించేందుకు  రోడ్ నెట్‌వర్క్ డేటాబేస్ తయారీకి సిద్ధమైనప్పటికీ అనంతరం  ఆ అంశంపై అశ్రద్ధ కనబరిచారు.  జీహెచ్‌ఎంసీ పరిధిలో 6వేల కిలోమీటర్లకు పైగా రహదారులుండగా, తొలిదశలో వెయ్యి కిలోమీటర్ల మేర డేటాబేస్ రూపకల్పనకు సిద్ధమయ్యారు. అందుకు నియమించిన ప్రైవేట్ కన్సల్టెంట్ నివేదికనిచ్చినప్పటికీ, తదుపరి చర్యలపై తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తున్నారు.
 
హామీల అమలులో కమిషనర్లు విఫలం..
 
వర్షం నీరు సాఫీగా వెళ్లేందుకు నాలాలను విస్తరించడమే శరణ్యం.  నగరంలోని నాలాలు చాలావరకు కబ్జాలకు గురయ్యాయి. 30 అడుగుల వెడల్పు ఉండాల్సిన నాలాలు 7 అడుగులకు కుంచించించుకుపోయాయి. వీటి ఆధునీకరణ కోసం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ద్వారా రూ. 266 కోట్లు మంజూరై ఏడేళ్లు దాటినా 25 శాతం పనులు కూడా జరగలేదు. నాలాలను ప్రాధాన్యత క్రమంలో ఆధునీకరిస్తామని పలువురు కమిషనర్లు ప్రకటించినప్పటికీ, అమలులో విఫలమయ్యారు. ఎవరెవరు ఎప్పుడెప్పుడు  ఏం చెప్పారంటే..
 
 2007లో..
 
 కిర్లోస్కర్, వాయంట్స్ కమిటీల నివేదికల కనుగుణ ంగా నాలాలా ఆధునీకరణ (విస్తరణ) పనులు ఏడాదిలోగా పూర్తి చేస్తామని అప్పటి కమిషనర్ సీవీఎస్‌కే శర్మ  హామీ ఇచ్చారు.
 
 2010లో..
 
ఆరు నెలల్లోగా నాలాలను ఆక్రమించిన వారిని ఖాళీ చేయించి ఆధునీకరణ పనులు పూర్తిచేస్తామని అప్పటి కమిషనర్ సమీర్‌శర్మ ప్రకటించారు.
 
2011లో..
 
నాలాలే నా తొలి ప్రాధాన్యం. నాలాల ఆధునీకరణ పనులకు తొలి ప్రాధాన్యమిచ్చి పూర్తిచేస్తానని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు
 చేపట్టిన రోజున ఎంటీ కృష్ణబాబు చెప్పారు.  
 
వందల కోట్లు ఖర్చవుతున్నా..

నగరంలో రోడ్లు త్వరితంగా దెబ్బతినేందుకు ప్రధాన కారణం వర్షపునీరు వెళ్లే మార్గాల్లేకపోవడం. దాంతో నీరు చాలాసేపు రోడ్లపై నిలుస్తుండటంతో త్వరితంగా దెబ్బతింటున్నాయి. పైప్‌లైన్‌పనులు, కేబుల్‌పనులు వంటివి చేసినప్పుడు వెంటనే పూడ్చివేయకపోవడం. రోడ్ల ప్యాచ్‌వర్క్‌పనులు, పాట్‌హోల్స్ మరమ్మతులు ఏడాది పొడవునా ఎప్పటికప్పుడు చేయాలి.  తద్వారా ఖర్చు తగ్గుతుంది. కానీ  అది జరగడం లేదు.  రోడ్లపై నీరు నిల్వలేకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోనంత వరకు ఏంచేసినా ప్రయోజనం ఉండదు. దీంతో, ఏటా రూ. 250- రూ. 300 కోట్ల వరకు రోడ్ల కోసం ఖర్చు చేస్తున్నా ప్రజల ఇబ్బందులు తగ్గడం లేవు. రోడ్లపై నీటి నిల్వకు కారణం వచ్చే వరదనీటిని తట్టుకునే సామర్ధ్యం నగరంలో నాలాలకు లేకపోవడం. వీటి ఆధునీకరణ పనులకు నిధులు మంజూరైనా ఏడేళ్లుగా పనులు ముందుకు సాగడం లేవు. నాలాల విస్తరణ జరగనిదే, వరదనీరు సాఫీగా వెళ్లనిదే ఏ చర్యలు తీసుకున్నా నిష్ర్పయోజమని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు.
 
ఇలా చేస్తే మేలు.. !
 
ఢిల్లీ, ముంబై, తదితర నగరాల్లో ఏవైనా రహదారులు వేయాలంటే ముందుగా అక్కడి ఐఐటీకి లేఖ రాస్తారు. వారిచ్చిన సలహాలు, సూచనల మేరకు తగిన విధంగా రోడ్లు వేస్తారు. మన దగ్గర సైతం జేఎన్‌టీయూ, ఉస్మానియా విశ్వవిద్యాలయాలున్నప్పటికీ వారిని క్వాలిటీ పరీక్షలకు థర్డ్‌పార్టీగా తప్ప రోడ్డు వేసే ముందే సూచనలు తీసుకోవడం లేరు.
     
బీటీ రోడ్లు వేయాల్సిన ప్రాంతాల్ని, అక్కడి ట్రాఫిక్ రద్దీని, వాహన భారాన్ని, భూగర్భంలోని పరిస్థితుల్ని, తదితర పలు అంశాలు పరిశీలించి ఎంత లోతునుంచి రోడ్డు వేయాలన్నది నిర్ణయిస్తారు.దాన్ని బట్టే డీబీఎం, బీసీ, ఎస్‌డీబీసీలను వేస్తారు. వీటిల్లో డీబీఎం(డెన్స్ బిటుమినస్) బాగా ధృఢమైనది కాగా, మిగతా రెండు వరుసగా దానికంటే తక్కువ ధృఢమైనవి. బీటీరోడ్లు వేశాక రెండేళ్ల తర్వాత నిర్ణీత వ్యవధుల్లో సామర్ధ్య పరీక్షలు నిర్వహించాలి. అందుకుగాను బింకిల్‌మ్యాన్స్ బీమ్ డిఫ్లెక్షన్ టెస్ట్‌లు వంటివి చేయాలి.
     
రోడ్లు వేసే ముందే ట్రాఫిక్ భారం.. డ్రైనేజీ లైన్లు, కేబుల్స్ కోసం తవ్వకాలు.. తదితర అంశాలన్నింటినీ అంచనా వేసి,  అందుకనుగుణండా రహదారులు నిర్మించాలి.నగరంలో ఏ ఒక్క రహదారినీ సంపూర్ణంగా వేసింది లేదు. ప్యాచ్‌వర్క్‌లు తప్ప దేన్నీ సరైన పద్ధతిలో వేయడం లేరు.రోడ్డు నిర్మాణంతోపాటే  వరదనీటి కాలువలు, రోడ్డుపై నీరు నిల్వలేకుండా తగిన కేంబర్ (నీరు రోడ్డునుంచి పక్కకు  దిగిపోయేలా)తో వేయాలి. కానీ, నగరంలో అది జరగడం లేదు. కాంట్రాక్టర్లకే వదిలిపెడుతున్నారు.

వాటర్‌లాగింగ్ పాయింట్లలో కొన్ని..
 
రేతిఫైలి బస్టేషన్    ఒలిఫెంటా బ్రిడ్జి 
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2   న్యాక్ రోడ్డు
సారథి స్టుడియో   ఖైరతాబాద్ పెట్రోట్‌బంక్
చింతల్‌బస్తీ   విల్లా మేరీ కాలేజ్,   తెలుగు
అకాడమి, హిమాయత్‌నగర్   విక్టరీ ప్లేగ్రౌండ్
మెట్రోకేఫ్, ముషీరాబాద్   బస్‌భవన్
ఆజామాబాద్ జంక్షన్   గ్రామర్ స్కూల్,  ఆబిడ్స్   మాసాబ్‌ట్యాంక్ ఫ్లై ఓవర్   తెలుగుతల్లి జంక్షన్ (మెడిసిటీ వైపు)
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement