
కేన్సర్, ఆల్జీమర్స్‌కు కొత్త మందుల గుర్తింపు
♦ త్వరలో క్లినికల్ ట్రయల్స్
♦ ఐదేళ్లలో అందుబాటులోకి
♦ ఐఐసీటీ డెరైక్టర్ శ్రీవారి చంద్రశేఖర్
సాక్షి, హైదరాబాద్: కేన్సర్, ఆల్జీమర్స్ చికిత్సకు ఉపయోగపడే రెండు కీలకమైన రసాయనాలను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) గుర్తించినట్లు సంస్థ డెరైక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ తెలిపారు. ఈ రెండు రసాయనాల క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు అవసరమైన ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని మరో ఐదేళ్లలో అందరికీ అందుబాటులోకి వస్తాయని ఆయన వివరించారు. ఐఐసీటీలో మాజీ డెరైక్టర్ డాక్టర్ ఎ.వి.రామారావుకు పద్మభూషణ్ అవార్డు లభించిన సందర్భంగా బుధవారం ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఈ రెండు కొత్త మందులను గుర్తించినట్లు తెలిపారు. క్లినికల్ ట్రయల్స్‌లో అనుభవమున్న భాగస్వామితో కలసి పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. భారతీయులకు తక్కువ ఖర్చుతో మందులు అందించే షరతుతో దీనికి అవసరమైతే భాగస్వామ్య కంపెనీకి తమ పేటెంట్‌ను లీజ్‌కు ఇస్తామని చెప్పారు.
ప్రపంచస్థాయి పరిశోధనలకే ప్రాధాన్యం: డాక్టర్ ఏవీ రామారావు
శాస్త్రవేత్తగా, ఐఐసీటీ డెరైక్టర్ హోదాలోనూ తన ఆలోచనలు అంతర్జాతీయ స్థాయి, లేదా సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేపట్టడంపైనే ఉండేవని... ఆ శ్రమకు, క్రమశిక్షణకు గుర్తింపుగానే కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ఇచ్చిందని భావిస్తున్నట్లు డాక్టర్ ఎ.వి.రామారావు తెలిపారు. రిటైర్మెంట్ తరువాత కూడా ఇతరులకు సాధ్యం కాని పనులు మాత్రమే చేయాలన్న స్ఫూర్తిని ఆవ్రా లేబొరేటరీస్ ద్వారా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పద్మభూషణ్ లభించిన సందర్భంగా ఐఐసీటీ ఉద్యోగులు తనను సత్కరించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా పూణేలోని నేషనల్ కెమికల్ లేబొరేటరీ నుంచి ఐఐసీటీ డెరైక్టర్‌గా, శాస్త్రవేత్తగా తన అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమంలో సీసీఎంబీ మాజీ డెరైక్టర్ డాక్టర్ బాలసుబ్రమణియన్, ఐఐసీటీ డెరైక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.