సాక్షి, హైదరాబాద్: మట్టి పాత్రలు, వెదురు వస్తువులకు దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతుండటంతో వాటిని భారీ స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. కుల వృత్తులకు మరింత ఆదరణ తీసుకొచ్చేందుకు ఇప్పటికే అడుగులేస్తున్న సర్కారు.. మట్టి, వెదురు ఉత్పత్తులకు సాంకేతికతను జోడించి పారిశ్రామిక ఉత్పత్తులుగా మార్కెటింగ్ చేయాలని భావిస్తోంది. కాస్త పెట్టుబడి పెడితే అధిక సంఖ్యలో ఉపాధి కల్పనతో పాటు ఆర్థిక అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. బీసీ కార్పొరేషన్ ద్వారా పెద్ద సంఖ్యలో లబ్ధిదారులను ఎంపిక చేసేందుకుగాను దరఖాస్తులు స్వీకరిస్తోంది.
రూ.100 కోట్ల నిధి
మట్టి, వెదురుతో తయారు చేసే వస్తువులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. గృహోపకరణాల్లో వాడటంతో పాటు కార్పొరేట్ సంస్థలూ వీటికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్లాస్టిక్ ఉత్పత్తులతో పోల్చితే వీటి ధరలు తక్కువగా ఉండటమూ మరో కారణం. పొరుగు రాష్ట్రాలు ఈ ఉత్పత్తులతో భారీ స్థాయిలో వ్యాపారం చేస్తున్నాయి. మట్టి పాత్రల తయారీలో గుజరాత్.. వెదురు ఉత్పత్తుల్లో త్రిపుర ప్రథమ స్థానంలో ఉన్నాయి.
దీంతో ఈ పరిశ్రమలపై ప్రభుత్వం దృష్టి సారించింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న నేతృత్వంలో అధికారుల బృందం ఇటీవల ఈ రెండు రాష్ట్రాల్లో పర్యటించి వస్తువుల తయారీ పరిశ్రమలను పరిశీలించింది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జిస్తుండటాన్ని గమనించింది. దీంతో ఈ పరిశ్రమలపై రూ.100 కోట్లు ఖర్చు చేయాలని ఆ శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది.
రూ.లక్షతో యూనిట్
మట్టి పాత్రల తయారీ యూనిట్‌ను రూ.లక్షతోనే ఏర్పాటు చేయొచ్చు. ముడి ‘క్లే’మిక్స్ చేసేందుకు, వస్తురూపంలో మార్చేందుకు ఉపయోగించే రెండు మెషీన్లను రూ.లక్షలోపు ఖరీదుతోనే కొనుగోలు చేయొచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మన ప్రాంతంలో మట్టి కలపడం, తయారీకి ఎక్కువ శ్రమ పడుతుండటంతో కార్మికులు త్వరగా అలసిపోతున్నారు.
ఈ అధునాతన యంత్రాలతో శ్రమ తగ్గుతుంది. కుర్చీలో కూర్చొని పనిచేసే వీలుంటుంది. మట్టితో నమూనాలు చేసిన తర్వాత ఫినిషింగ్ ఇచ్చేందుకు సహజసిద్ధ రంగులు వాడుతారు. దీంతో పాత్రలు సరికొత్త అందాలతో కనిపిస్తాయి. ఇక వెదురు పరిశ్రమల ఏర్పాటులో ఎక్కువ యంత్రాలు అవసరమవుతాయి. సగటున రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలు పెట్టుబడి పెట్టాలి.
వ్యక్తిగతంగా కాకుండా 10 నుంచి 20 మంది కలసి సొసైటీగా ఏర్పాటై యూనిట్ స్థాపించవచ్చు. యూనిట్‌లో సగటున 100 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ పరిశ్రమలో ప్రధానంగా వెదురు క్లీనింగ్ అండ్ కట్టింగ్, సన్నని పుల్లల్లా కటింగ్ చేసే యంత్రం, అతికించి చెక్కలుగా ప్రెస్ చేసే యంత్రాలుంటాయి. అలా వుడ్ రూపంలోకి వచ్చిన సరుకును ఫర్నిచర్‌గా తయారు చేయొచ్చు.
జిల్లా, తాలూకా కేంద్రాల్లో..
‘మట్టి, వెదురు పరిశ్రమలను జిల్లా, తాలూకా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తే సత్ఫలితాలుంటాయి. ఔత్సాహికులు వ్యక్తిగతంగా కాకుండా 10 నుంచి 20 మందితో సొసైటీ రూపంలో ఏర్పాటవ్వాలి. దీంతో పరిశ్రమలకు స్థలం కేటాయించడమో.. లీజుకివ్వడమో జరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో దొరికే బంకమట్టిని పరీక్షలకు పంపించనున్నాం. పాత్రల తయారీకి ఏ మేరకు సహకరిస్తుందో, లేదంటే మరిన్ని మిశ్రమాలేమైనా కలపాలో పరీక్షలో తెలుస్తుంది.
వెదురు సాగుకు ఏటా సగటున 1,500 ఎంఎం వర్షపాతం కావాలి. కానీ రాష్ట్ర సగటు 800 ఎంఎం. ఆదిలాబాద్ లాంటి జిల్లాలో 1,100 పైగా ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా నీటి వనరులు అందించడంపై పరిశీలన చేస్తున్నాం. రెండు మూడు నెలల్లో కార్యాచరణ పూర్తవుతుంది. ఈ పరిశ్రమలతో 2 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. ఔత్సాహికులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, తర్వాత యూనిట్ మంజూరు చేస్తాం’ అని జోగు రామన్న తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment