
భూదోపిడీపై సీబీఐ విచారణ జరపాలి
► గవర్నర్‌ను కోరిన టీపీసీసీ బృందం
► ఎమ్మెల్యేల ఫిరాయింపుల వెనుక భూముల పందేరం: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: రాజధాని శివారు భూమాయపై కాంగ్రెస్ నేతలు కలసికట్టుగా కదిలారు. గురువారం గవర్నర్‌ను కలసి ఫిర్యాదు చేశారు. భూకుంభకోణంలో రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల పాత్ర ఉందని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని టీపీసీసీ బృందం గవర్నర్‌కు విజ్ఞప్తి చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ అగ్రనేతలు గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. దేశంలోనే ఇంతపెద్ద భూదోపిడీ, కుంభకోణం జరగలేదని ఆయనకు వివరించారు. రాజ్యాంగ పరిరక్షకుడిగా, ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యతతో తక్షణమే స్పందించాలని గవర్నర్‌ను కోరారు.
సీఎల్పీ నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, ప్రజాపద్దుల కమిటీ చైర్‌పర్సన్ జె.గీతారెడ్డి, శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీమంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కె.లక్ష్మారెడ్డి, శ్రీశైలంగౌడ్, డి.సుధీర్‌రెడ్డి, బిక్షపతి యాదవ్, డీసీసీల అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి, క్యామ మల్లేశం, ఒబేదుల్లా ఖాన్, సంతోష్‌కుమార్ గవర్నర్‌ను కలిసినవారిలో ఉన్నారు. హైదరాబాద్ శివారుల్లోని మియాపూర్, కూకట్‌పల్లి, మేడ్చల్, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను కొందరు అక్రమంగా దక్కించుకున్నారని ఫిర్యాదు చేశారు.
సీఎం మాటమార్చడంలో మర్మమేమిటి?
ప్రభుత్వ భూముల్లో భారీగా కుంభకోణం జరిగిందన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు గజం భూమి కూడా పోలేదని చెప్పడం వెనుక ఏదో మతలబు ఉందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం రాజ్‌భవన్ ఎదుట ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు, భూముల కుంభకోణానికి సంబంధముందని ఆరోపించారు. ప్రతీ ఫిరాయింపు వెనుక ప్రభుత్వ భూముల బదలాయింపు, అక్రమ రిజిస్ట్రేషన్ ఉందనే విషయాన్ని గవర్నర్‌కు వివరించామని చెప్పారు. ప్రభుత్వ భూములపై ఏర్పాటైన ఎస్.కె.సిన్హా కమిటీ నివేదికను బయటపెట్టాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సన్నిహితంగా ఉన్నవారు, ప్రభుత్వంలో కీలకంగా ఉన్నవారు, సీఎం పేషీ అధికారులు ప్రధానపాత్ర పోషిం చారని ఆరోపించారు. వాస్తవాలు బయటపడినందుకే టీఆర్‌ఎస్ ఎంపీ కె.కేశవరావు తన 50 ఎకరాల భూముల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకున్నారని ఉత్తమ్ అన్నారు.
జాతీయస్థాయిలో పోరాటం: సీఎల్పీ తీర్మానం
భూముల కుంభకోణంపై జాతీయ స్థాయిలో పోరాటం చేయాలని కాంగ్రెస్ శాసనసభాపక్షం(సీఎల్పీ) తీర్మానించింది. కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు కె.జానారెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ ఆవరణలో గురువారం సీఎల్పీ సమావేశమైంది. సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఇటీవల మృతి చెందిన ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, కేంద్ర మాజీమంత్రి దాసరి నారాయణరావు, జ్ఞానపీఠ్ అవార్డు‡ గ్రహీత సి.నారాయణరెడ్డికి సీఎల్పీ సంతాపం ప్రకటించింది. అనంతరం మియాపూర్‌సహా రాష్ట్రంలో జరిగిన భూకుంభకోణం, వ్యవసాయం, రైతుల పరిస్థితిపై చర్చించి తీర్మానాలు చేసింది.
ఈ సమావేశం వివరాలను శాసనమండలిలో ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి మీడియాకు వివరించారు. మియాపూర్ భూకుంభకోణం దేశంలోనే అతిపెద్దదని, సీబీఐ విచారణకు తగిన కేసు అని సీఎల్పీ అభిప్రాయపడినట్టు చెప్పారు. ఈ కుంభకోణంపై జాతీయస్థాయి పోరాటానికి కాంగ్రెస్‌పార్టీ చొరవ తీసుకోవాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఇందులో భాగంగా అన్ని పార్టీల నేతలతో వెళ్లి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, సీబీఐ డైరెక్టర్‌ను కలసి ఫిర్యాదు చేయాలని తీర్మానించినట్లు వివరించారు.
క్షేత్రస్థాయి పోరాటాలకు టీపీసీసీలో చర్చించి, నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో అన్ని జిల్లాల్లో సభలను నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు వెల్లడించారు. కాంగ్రెస్‌పార్టీ సీనియర్‌నేత, రాజ్యసభసభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి పేరును నల్లగొండ జిల్లాలోని ఒక ప్రాజెక్టుకు పెట్టాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని సీఎల్పీ నిర్ణయించిందని పొంగులేటి తెలిపారు.