మళ్లీ రెచ్చి పోయారు...
హైదరాబాద్లో చైన్ స్నాచర్లు మరోసారి తమ ప్రతాపం చూపించారు. ఇప్పటికే హడలెత్తిస్తున్న చైన్ స్నాచర్లు శనివారం మరోసారి రెచ్చిపోయారు. హైదరాబాద్ మీర్‌పేట్‌లో పది నిమిషాల వ్యవధిలోనే ఇద్దరు మహిళల నుంచి గొలుసులు తెంపుకుపోయారు. ఇద్దరు మెడల్లోంచి దాదాపు 7 తులాల బంగారు గొలుసులు లాక్కుని పరారయ్యారు.
మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రశాంతి హిల్స్‌రోడ్‌లో సరళమ్మ అనే మహిళ మెడలోని గొలుసును లాక్కుపోయారు. ఇంటి ముందు వాకిలి ఊడ్చుతుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఈ దొంగతనానికి పాల్పడ్డారు. సాయివిహార్ కాలనీకి చెందిన వెంకటలక్ష్మి అనే మరో మహిళ మెడలోనుంచి 3 తులాల గొలుసును లాక్కుపోయారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇక వనస్థలిపురం హైకోర్టు కాలనీలో ఈ ఉదయం ఇద్దరు చైన్‌స్నాచర్‌లు రెచ్చిపోయారు. ఇంటి ముందు పూలు కోసుకుంటున్న జయమ్మ అనే మహిళ మెడలో నుంచి నాలుగు తులాల బంగారు గొలుసు తెంపుకుపోయారు. చడీచప్పుడు లేకుండా బైక్‌పై వచ్చిన దుండగులు మెడలోని గొలుసు లాక్కుపోయారు.
అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులను సైతం నెట్టేస్తూ పారిపోయారని బాధితురాలు లబోదిబోమంది. ఇక హైదరాబాద్ నాగోల్‌లో చైన్‌స్నాచర్లు రెచ్చిపోయారు. బండ్లగూడ కృషినగర్‌లో బైక్‌పై వచ్చిన ఇద్దరు దొంగలు...ఆరు బయట కూర్చున్న సుశీలమ్మ అనే వృద్ధురాలిని అడ్రస్ అడినట్లు నటించి.... మెడలోంచి 3 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు. స్నాచర్లు గట్టిగా గొలుసు లాగడంతో... సుశీలమ్మ కింద పడి తీవ్ర గాయాలపాలైంది. కుటుంబ సభ్యులు వచ్చేలోపే దొంగలు పరారయ్యారు. ఈ ఘటనలో వృద్ధురాలి కాలు,చేయి విరిగిపోయాయి. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
ఓవైపు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని, గొలుసు దొంగలను పట్టుకుంటామని చెబుతున్నా చైన్ స్నాచర్స్ మాత్రం పోలీసులకు గట్టి సవాలే విసురుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తామంటుంటే...దొంగలు మాత్రం మహిళల మెడల్లో ఉన్న బంగారు గొలుసులు తెంచుకు పోతున్నారు.