
జాతీయ గీతం మర్యాద పట్టని ఏపీ సీఎం
* తెలంగాణ సర్కారు సందడిలో ఒంటరైన చంద్రబాబు
* జాతీయ గీతాలాపన ఆరంభమైనా కారెక్కి వెళ్లిన వైనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి హైదరాబాద్ రాకను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో ఏపీ సీఎంచంద్రబాబు ఒంటరయ్యారు. కార్యక్రమం ఆద్యంతం తెలంగాణ ప్రభుత్వ సందడే కనిపించింది. తనతో మాట్లాడేవారే కరువవడంతో ఇబ్బందిగా ఫీలయిన బాబు.. రాష్ట్రపతి ప్రణబ్ రాగానే ఆయనకు నమస్కరించి మధ్యలోనే నిష్ర్కమించారు. ఆ సమయంలో జాతీయ గీతాలాపన ఆరంభమైనప్పటికీ..పట్టించుకోకుండా వెళ్లిపోయారు.
రాష్ట్రపతి రాక సందర్భంగా బేగంపేట విమానాశ్రయం వద్ద బాబు, ఏపీ మండలి చైర్మన్ చక్రపాణి, ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, మరో ఇద్దరు అధికారులు మినహా ఏపీ వారెవరూ కన్పించలేదు. అదే సమయంలో తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు, అధికారులతో సందడి వాతావరణం నెలకొంది. సీఎం కేసీఆర్ సైతం ఆద్యంతం అక్కడున్న ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి పలకరిస్తూ.. ఉత్సాహంగా గడిపారు. నేతలెవరూ పట్టించుకోకపోవడంతో బాబు ఇబ్బందిపడ్డారు.
ఏం చేయాలో తెలియక తన పక్కనేఉన్న గవర్నర్ నరసింహన్‌తో కొద్దిసేపు ముచ్చటించిన చంద్రబాబు... రాష్ట్రపతి రాగానే విమానం వద్దకు వెళ్లి అందరితో పాటు స్వాగతం పలికారు. అనంతరం ప్రణబ్ సైనిక వందనం స్వీకరించేందుకు వెళ్లగా.. చంద్రబాబు స్వాగత వేదిక వద్దకు రాకుండానే వెనుదిరిగారు. ఆ సమయంలో జాతీయ గీతాలాపన ఆరంభమైనా అదేమీ పట్టించుకోకుండా చంద్రబాబు కారెక్కి వెళ్లిపోయారు. అక్కడున్న అధికారులంతా చంద్రబాబు తీరుకు అవాక్కయ్యారు.