‘హోదా’ ఊసెత్తని సీఎం
భాగస్వామ్య సదస్సులో సుదీర్ఘ ప్రసంగం
♦ ప్రత్యేక హోదా అంశాన్ని కనీసం ప్రస్తావించని చంద్రబాబు
♦ కేంద్ర మంత్రులతోనూ ప్రకటన చేయించని వైనం
♦ విస్మయం వ్యక్తం చేస్తున్న పారిశ్రామిక, అధికార వర్గాలు
సాక్షి, హైదరాబాద్: దేశ విదేశీ పెట్టుబడుల రాకకు, రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి అత్యంత కీలకం... ప్రత్యేక హోదా. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రావాలని ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఈ విషయాన్ని విస్మరిస్తున్నారు. విశాఖపట్నంలో ఆదివారం పారిశ్రామిక భాగస్వామ్య సదస్సును ఉద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించిన ఆయన ప్రత్యేక హోదా అంశాన్ని మాటమాత్రమైనా ప్రస్తావించకపోవడం గమనార్హం. సీఐఐ, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్‌తోపాటు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.
ఇలాంటి ముఖ్యమైన సదస్సులో... రాష్ట్రాభివృద్ధికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా గురించి ముఖ్యమంత్రి ఒక్క ముక్క కూడా మాట్లాడకపోవడం పారిశ్రామిక దిగ్గజాలను నిరాశకు గురిచేసింది. అధికార యంత్రాంగం కూడా విస్మయానికి గురైంది. నిజానికి వేదికపైనే ఉన్న కేంద్ర మంత్రులతో ప్రత్యేక హోదాపై ప్రకటన చేయిస్తారని పారిశ్రామికవేత్తలు ఆశించారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అనువైన రాష్ట్రంగా ప్రపంచ బ్యాంకు రెండో స్థానం ఇచ్చిందని ముఖ్యమంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇదే సమయంలో పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చే ప్రత్యేక హోదా అంశాన్ని పట్టించుకోకపోవడం గమనార్హం. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ కీలక సమావేశంలో ముఖ్యమంత్రి దీనిని కనీసం ప్రస్తావించకపోవడం దారుణమనే అభిప్రాయం పారిశ్రామిక, అధికార వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ప్రత్యేక హోదా సంజీవని కాదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తొలినుంచే దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
21 రోజుల్లో అనుమతులిస్తారట!
పరిశ్రమలను స్థాపించడానికి దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో అన్ని అనుమతులను మంజూరు చేస్తామని ప్రభుత్వం గతంలో పారిశ్రామిక విధానాన్ని ప్రకటించిన సమయంలో పేర్కొంది. అప్పుడే అది వివాదాస్పదం కావడంతో 21 రోజుల్లో అనుమతులు కాదు, దరఖాస్తుల పరిశీలనను పూర్తిచేస్తామని ప్రకటించింది. అయితే పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో మాత్రం సీఎం భిన్నమైన ప్రకటన చేశారు. తాను మూడు రోజులు ఇక్కడే ఉంటానని, సదస్సుకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఒప్పందం చేసుకుంటారని ఆశిస్తున్నానని, 21 రోజుల్లో అనుమతులు ఇస్తామని చెప్పడం గమనార్హం. గతంలో 21 రోజుల్లో దరఖాస్తులను పరిశీలిస్తామని చెప్పి ఇప్పుడు 21 రోజుల్లో అనుమతులు ఇస్తామనడం పట్ల సదస్సుకు హాజరైన పారిశ్రామికవేత్తలు విస్మయానికి లోనయ్యారు.