చంద్రబాబు వితండ వాదన... వింత వైఖరి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చుట్టూ మంత్రులు భూములు కొనుగోలు చేసిన వ్యవహారంపై శాసనసభ అట్టుడికింది. అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలతో అసెంబ్లీ దద్దరిల్లింది. రాజధాని చుట్టుపక్కల అత్యంత చవకగా మంత్రులు, వారి బినామీలు భూములను కొనుగోలు చేసిన వ్యవహారంపై ప్రతిపక్ష నాయకుడు చేసిన ఆరోపణలపై అసెంబ్లీలో సుదీర్ఘ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వింత వాదనకు దిగారు.
అమరావతిలో రాజధాని ఏర్పాటు విషయంలో తన వాళ్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అఫీషియల్ ఓత్ ఆఫ్ సీక్రసీ ఉల్లంఘించారని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ చేయించాలని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అధికార రహస్యాలను కాపాడుతానని ప్రమాణం చేసిన చంద్రబాబు ఆ రహస్యాలను కాపాడకుండా ఉల్లంఘించారని, ఈ వ్యవహారంలో ఆయనే దోషి అయినందున మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఏవైనా అక్రమాలు, అవకతవకలు జరిగాయని ప్రతిపక్షం శాసనసభలో ఆరోపణలు చేసినప్పుడు దానిపై ప్రభుత్వం సమగ్రమైన వివరణ ఇస్తుంది. లేదా విచారణకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటిస్తుంది. అయితే బుధవారం అసెంబ్లీలో అందుకు భిన్నమైన పరిస్థితి తలెత్తింది. సభా నాయకుడైన ముఖ్యమంత్రి ప్రతిపక్షం చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వకపోగా మంత్రులు కొనుగోలు చేసినట్టు చెబుతున్న భూముల సర్వే నంబర్లు ఇప్పటికిప్పుడు సభలో ఇవ్వాలి. లేదంటే జగన్ మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి.. అప్పటివరకు సభ జరగడానికి వీలులేదంటూ చంద్రబాబు భీష్మించారు.
ఒకటికి నాలుగు సార్లు చంద్రబాబు ఇదే మాట అనడంతో అధికార పార్టీకి చెందిన మంత్రులు, సభ్యులు కూడా అదే వాదన మొదలుపెట్టారు. ఒకదశలో ముఖ్యమంత్రి అసహనంతో ఊగిపోయారు. రాజధాని రాకుండా తగులబెట్టాలనుకుంటున్నారు. తమాషా అనుకుంటున్నారా... ఇలాంటి వాళ్లను ప్రతిపక్షంగా ఎన్నుకుంటే ఏం కావాలి.... అంటూ ఊగిపోయారు. సభ జరగడానికి వీలులేదంటూ పట్టుబట్టారు. ప్రతిపక్ష సభ్యులను సంతృప్తి పరిచి సభను సజావుగా నడిపించే విషయంలో సభా నాయకుడు సహనంతో వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి సభ జరగడానికి వీలులేదంటూ చెప్పడం విశేషం.
ప్రభుత్వం నుంచి సంతృప్తికరమైన సమాధానం రానప్పుడు ప్రతిపక్షం తన నిరసన తెలియజేయడం చట్ట సభల్లో సర్వ సాధారణంగా జరుగుతుంది. సందర్భాన్ని బట్టి నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తుంది. అంతవరకు ప్రతిపక్షం ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం సాధారణంగా చట్ట సభల్లో జరుగుతుంది. కానీ బుధవారం అందుకు భిన్నమైన పరిస్థితి తలెత్తింది. అది కూడా సభా నాయకుడే కారణం కావడం విశేషం. మంత్రులు ఎలాంటి భూములు కొనుగోలు చేయలేదని గానీ విచారణ జరిపిస్తానని గానీ ఏమీ చెప్పకుండా సభా నాయకుడే సభ ముందుకు జరగొద్దని చొప్పడం శాసనసభ చరిత్రలో ఇదే మొదటిసారి అని సీనియర్ నేతలు చెప్పారు.