పగలూ తనిఖీలు!
ప్రారంభించిన జంట కమిషనరేట్లు
లో-క్లాస్ లాడ్జీలపై ప్రధాన దృష్టి
పోలింగ్ ఏజెంట్ల వివరాలపై ఆరా
రౌడీషీటర్లపై నిఘా ముమ్మరం
సాక్షి, సిటీబ్యూరో
గ్రేటర్ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో జంట కమిషనరేట్ల పోలీసులు అప్రమత్తమవుతున్నారు. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో తనిఖీల విధానంలో సమూల మార్పులు తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు రాత్రి వేళల్లో మాత్రమే సోదాలు నిర్వహించిన పోలీసులు.. ఇకపై పగటి పూట కూడా తనిఖీలు చేయాలని నిర్ణయించారు. టాస్క్‌ఫోర్స్, సీసీఎస్, ఎస్‌ఓటీ బలగాలు ఇప్పటికే వీటిని ప్రారంభించాయి. రానున్న రోజుల్లో ఇతర బృందాలు కూడా ఈ సోదాలు నిర్వహించనున్నాయి. నేరగాళ్లను పట్టుకునేందుకు పోలీసులు రాత్రి పూట లాడ్జీల్లో తనిఖీలు నిర్వహించేవారు. ఎన్నికల నేపథ్యంలో అసాంఘిక శక్తులు, ఇతర ప్రాంతాల నుంచి ‘ప్రత్యేక పనుల’పై వచ్చే వారు వీటిలో తలదాచుకుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే ఈ విధానాన్ని తెరపైకి తెచ్చారు. సాధారణంగా పొరుగు జిల్లాల నుంచి ‘ఎన్నికల’ కోసం వచ్చే వాళ్లు లో-క్లాస్ లాడ్జీల్లో బస చేసేందుకే మొగ్గు చూపుతారు. ఈ నేపథ్యంలో పోలీసులు వీటిపై ప్రధానంగా దృష్టి సారించారు. తరచూ ఆకస్మిక తనిఖీలు చే యాలని నిర్ణయించారు.
సామాన్యులకు ఇబ్బంది లేకుండా...
హైదరాబాద్‌కు ఇతర జిల్లాల నుంచి అనేక మంది వస్తుంటారు. విద్యా, వైద్య, వ్యాపార పనులతో పాటు విహారం కోసం వచ్చే వారు లాడ్జీలనే ఆశ్రయిస్తుంటారు. ఈ పరిణామాలు దృష్టిలో పెట్టుకున్న అధికారులు తమ తనిఖీల వల్ల సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సోదాల నేపథ్యంలో ప్రజలతో మర్యాద పూర్వకంగా నడుచుకోవాలని ఉన్నతాధికారులు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మహిళలు, వృద్ధులతో పాటు కుటుంబ సమేతంగా ఉండే వారితో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఏజెంట్లు, రౌడీషీటర్లపై డేగకన్ను
ధన, బల ప్రయోగాలతో ఓటర్లను ప్రభావితం చేయగలిగే వారిని పోలింగ్ ఏజెంట్లుగా నియమించుకోవడానికి కొందరు అభ్యర్థులు పథకం వేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ ఏజెంట్లపై డేగకన్ను వేశారు. వారి వివరాలు ఆరా తీయాలని నిర్ణయించారు. అభ్యర్థి తన తరఫున ప్రతి పోలింగ్ బూత్‌లో ఒక ఏజెంట్‌ను నియమించుకోవచ్చు. అయితే నేర చరితులను ఏజెంట్‌గా నియమించకూడదనే నిబంధన ప్రస్తుతం అమలులో లేకపోవడంతో.. అసాంఘిక శక్తుల్ని తమ ఏజెంట్‌గా పెట్టుకునే అవకాశం అభ్యర్థులకు లాభిస్తోంది. నేరచరితులు ఏజెంట్లుగా ఉండటం వల్ల ఓటర్లు భయభ్రాంతులకు లోనై ప్రభావితులయ్యే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న పోలీసులు ఏజెంట్ల వివరాలు కూపీ లాగుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఇక రౌడీ షీటర్లు తమ హవా చూపడం ప్రారంభిస్తారు. కొన్ని పార్టీల తరఫున రంగంలోకి దిగి సెటిల్మెంట్లు చేసే అవకాశం ఉంది. ఈసారి చాలా మంది రౌడీషీటర్లు పీడీ యాక్ట్ కింద జైల్లోనే ఉన్నారు. అయినప్పటికీ కొందరు ఈ కోణంలో ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న టాస్క్‌ఫోర్స్, ఎస్‌ఓటీ పోలీసులు వారితో పాటు వారి అనుచరుల కదలికలపై నిఘా వేశారు. ఓ పక్క బైండోవర్ కాని వారి కోసం గాలిస్తూనే.. మరోపక్క బైండోవర్ అయిన వారి వ్యవహారాలు అనునిత్యం ఆరా తీస్తున్నారు.