ఉద్యమ ద్రోహి తుమ్మల కుడి భుజమా?
► పాలేరులో టీఆర్‌ఎస్‌ను ఓడించి తీరుతాం
► తెలంగాణ స్ఫూర్తి యాత్ర ముగింపు సభలో చెరుకు సుధాకర్
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ ఉద్యమ ద్రోహి తుమ్మల నాగేశ్వర్‌రావు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కుడి భుజమవుతారట.. కాలం కలిసొస్తే నడిచే కొడుకు అవుతాడట.. ఖమ్మంలో జరిగింది పక్కగా దొంగల ప్లీనరీనే, పాలేరులో టీఆర్‌ఎస్‌ను ఓడించి తీరుతాం’ అని తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర కన్వీనర్ చెరుకు సుధాకర్ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. అంబేడ్కర్, పూలే జయంతి సందర్భంగా తెలంగాణ ఉద్యమ వేదిక నేత చెరుకు సుధాకర్ ఆధ్వర్యంలో ఈ నెల 14న ప్రారంభమైన తెలంగాణ స్ఫూర్తియాత్ర శనివారం ఓయూలో ముగిసింది. ఈ సందర్భంగా ఓయూ విద్యార్థి జేఏసీ ఆర్ట్స్ కళాశాల ఎదుట తెలంగాణ ఉద్యమ సామాజిక పునరేకీకరణ బహిరంగ సభ నిర్వహిం చింది.
కార్యక్రమానికి విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు దేశగాని సాంబశివగౌడ్ అధ్యక్షత వహించగా చెరుకు సుధాకర్, డాక్టర్ గోపినాధ్, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కి, శ్రీశైల్‌రెడ్డి తదితరులు పాల్గొని మహానీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం చెరుకు సుధాకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనపై ధ్వజమెత్తారు. ఉద్యమాన్ని అడ్డుకొని, తెలంగాణ రాష్ట్ర అవతరణకు సహకరించని మంత్రులు తలసాని శ్రీనివాస్,కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర్‌రావు, మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కొండా సురేఖలకు పార్టీలో అధిక ప్రాధాన్యతను కల్పించడం దారుణమన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని దొంగలు, లిక్కర్ మాఫియా, రౌడీలు ఏలుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ గొంతుగా ప్రజలను చైతన్య పరిచేందుకు పది జిల్లాలో నిర్వహించిన స్ఫూర్తి యాత్రకు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించిందన్నారు. బంగారు తెలంగాణ తీసుకువస్తానన్న కేసీఆర్ బతుకులేని తెలంగాణగా మారుస్తున్నారని విమర్శించారు.