ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం, అక్కడి రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇందుకు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు, నాయకులు ఏకం కావాలన్నారు. మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డితో పాటు పలువురు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచులు సీఎం అధికారిక నివాసంలో మంగళవారం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కరువుతో అల్లాడే పాలమూరుకు సాగునీరివ్వాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ఒకరు దీక్షకు దిగుతామని, మరొకరు కేబినెట్ తీర్మానం చేసి ఢిల్లీకి పంపిస్తామని చెబుతున్నారని కేసీఆర్ అన్నారు.
తెలంగాణ ప్రాజెక్టుల కోసం అప్పటి ఆంధ్రా పాలకులు జీవోలు ఇచ్చి, శంకుస్థాపనలు చేసి, కొబ్బరి కాయలు కూడా కొట్టారని, అయితే నీళ్లు మాత్రం రాలేదన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో వలసలు ఆపి 16 నుంచి 17 లక్షల ఎకరాలకు సాగు నీరందించడమే తన లక్ష్యమన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయల్‌సాగర్ వంటి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తానన్నారు. భీమా ప్రాజెక్టు ద్వారా ఈ ఖరీఫ్‌కే 1.5 లక్షల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. మంత్రులు హరీశ్‌రావు, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.