♦ అడ్డగోలు ధర్నారాయుళ్ళపై కఠిన చర్యలు
♦ కంప్యూటరైజ్డ్ డేటాబేస్ సిద్ధం చేస్తున్న కాప్స్
♦ పబ్లిక్ న్యూసెన్స్ కేసులపైనా ప్రత్యేక దృష్టి
సాక్షి, సిటీబ్యూరో: రహదారులపై భారీ ట్రాఫిక్ జామ్స్‌కు కారణమవటంతో పాటు సామాన్యులకు ఇబ్బందికరంగా మారుతున్న నిరసనలపై నగర పోలీసు విభాగం ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఇప్పటి వరకు ఈ తరహా ఆందోళనకారులను ముందస్తు అరెస్టు చేసి వదిలిపెడుతున్నారు. ఈ రకంగా పదేపదే రోడ్లపైకి వచ్చే ధర్నారాయుళ్ళను ఇకపై అరెస్టు చేసి, జైలుకు పంపాలని నిర్ణయించారు. దీంతోపాటు మరికొన్ని పబ్లిక్ న్యూసెన్సుల్నీ తీవ్రంగా పరిగణించాలని భావిస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా కంప్యూటరైజ్డ్ డేటాబేస్ రూపొందిస్తున్నారు. కొత్త ఏడాది నుంచి ఇది అన్ని పోలీసుస్టేషన్లకూ అనుసంధానించి పని చేయనుంది.
చెప్పేదొకటి... చేసేదొకటి...
ప్రభుత్వ నిర్ణయాలతో పాటు అనేక అంశాలపై నిరసన తెలపడానికి సమాయత్తమవుతున్న ఆందోళనకారులు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో సామాన్యులకు, ట్రాఫిక్‌కు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని నిర్వాహకులు హామీ ఇస్తున్నారు. వీటికి సంబంధించి పోలీసు అధికారులు సైతం కొన్ని షరతులు విధిస్తున్నారు. అనుమతి వచ్చిన తరవాత చేపట్టే ఈ నిరసనలు ఒక్కోసారి నిర్వాహకులు చేతులు దాటిపోతున్నాయి. నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు చేయడం, రహదారులపైకి వచ్చి వాహనాలు, సామాన్యులకు ఇబ్బంది కలిగించడం, కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విధ్వంసాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా కలెక్టరేట్లతో పాటు మరికొన్ని సున్నిత, కీలక ప్రాంతాల్లో ఈ అపశృతులు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.
ఇప్పటి వరకు ఎక్కడికక్కడే...
నగరంలో పదేపదే ఆందోళనలకు దిగే నిరసనకారులు కొందరు ఉన్నట్లు పోలీసు అధికారులు చెప్తున్నారు. వీరు ఒక్కో సందర్భంలో ఒక్కో ప్రాంతంలో నిరసనలకు దిగుతున్నారు. అప్పుడు ముందస్తు అరెస్టులు చేస్తున్న స్థానిక పోలీసులు ఠాణాలకు తరలించి, సొంత పూచీకత్తుపై విడిచిపెడుతున్నారు. ఎవరెవరిని ముందస్తు అరెస్టు చేశారనేది ఆ పోలీసుస్టేషన్ రికార్డులకే పరిమితమవుతోంది. కంట్రోల్‌రూమ్‌తో పాటు ఉన్నతాధికారులకు కేవలం సంఖ్య మాత్రమే తెలియజేస్తున్నారు.
దీంతో పదేపదే నిరసనలకు దిగే ఆందోళనకారులు చెలరేగిపోతున్నా, ఎన్నిసార్లు ముందస్తు అరెస్టులు అవుతున్నా కఠిన చర్యలు కరువయ్యాయి. దీంతో పాటు నగరంలో పోలీసు కమిషనర్ తరచు నిషేధాజ్ఞలు విధిస్తుంటారు. వీటి ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి నిరసనలు, సభలు, సమావేశాలు నిర్వహించడానికి వీలులేదు. అయినప్పటికీ కొందరు వీటిని బేఖాతరు చేస్తూ రోడ్లెక్కినా ముందస్తు అరెస్టులతో సరిపెట్టాల్సి వస్తోంది.
పదేపదే చిక్కితే జైలుకే...
ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా నగర పోలీసు విభాగం ప్రత్యేక అప్లికేషన్ తయారు చేస్తోం ది. ఇది ఇంట్రానెట్ ద్వారా అన్ని పోలీసుస్టేషన్లు, ఏసీపీ, డీసీపీ కార్యాలయాలతో పాటు ఉన్నతాధికారుల ఆఫీసులకూ అనుసంధానించి ఉంటుం ది. నిరసనలు, నిషేధాజ్ఞల ఉల్లంఘనలతో పాటు పబ్లిక్ న్యూసెన్స్ చేస్తూ పట్టుబడి, ముందస్తు అరెస్టు అయిన వారి పూర్తి వివరాలు, ఆధార్ నెంబర్, వేలి ముద్రల్ని పోలీ సులు కచ్చితంగా సేకరిస్తారు. వీటిని కంప్యూటర్‌లో నిక్షిప్తమై ఉండే అప్లికేషన్‌లో పొందుపరుస్తారు. ఈ డేటాబేస్ అన్ని ఠాణాలకు అనుసంధానించి ఉన్న నేపథ్యంలో ఓ వ్యక్తి, కొందరు వ్యక్తులు పదేపదే ఆందోళనలకు దిగితే ఆ విషయాన్ని గుర్తించే అప్లికేషన్ అధికారులకు తెలియజేస్తుంది. దీని ఆధారంగా వారిని ఆధారాలతో సహా కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించడానికి ఆస్కారం ఏర్పడుతుంది.
‘ముందస్తు’ కాదు... ఇక అరెస్టులే!
Published Sun, Dec 27 2015 3:49 AM | Last Updated on Sun, Sep 3 2017 2:37 PM
Advertisement
Advertisement