డల్లాస్‌లో నాట్స్ ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్! | NATS Dallas Conducts Coffee With A Cop | Sakshi
Sakshi News home page

డల్లాస్‌లో నాట్స్ ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్!

Published Fri, Sep 29 2023 10:26 AM | Last Updated on Fri, Sep 29 2023 10:26 AM

NATS Dallas Conducts Coffee With A Cop - Sakshi

ఉత్తర ఆమెరికా తెలుగు సంఘం (నాట్స్) భాషే రమ్యం , సేవే గమ్యం, తమ లక్ష్యం అని చాటడమే కాక దాన్ని నిరూపించే దిశగా ప్రవాసంలోని భారతీయుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో, డల్లాస్ లో అసంఖ్యాకంగా పెరుగుతున్న తెలుగు వారి సంరక్షణ నిమిత్తం, ఇటీవల పెరుగుతున్న నేరాలు, దోపిడీలను దృష్టిలో ఉంచుకొని కాఫీ విత్ ఎ కాప్ (Coffee with a Cop) అనే కార్యక్రమాన్ని నాట్స్ డల్లాస్ చాప్టర్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. స్థానిక ఫ్రిస్కో మోనార్చ్ వ్యూ పార్క్, ఫ్రిస్కో, టెక్సాస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఫ్రిస్కో పోలీస్ శాఖ నుండి విచ్ఛేసిన ఆఫీసర్ గిబ్సన్ మరియు డిటెక్టివ్ చావెజ్ ముఖ్యంగా ప్రజలు దొంగతనాలు, దోపిడీల బారిన పడకుండా వహించాల్సిన జాగ్రత్తలు , ఇళ్ళ వద్ద ఏర్పాటు చేసుకోవాల్సిన రక్షణ ఏర్పాట్లను వివరించారు.

ఇంటి చుట్టూ ఉండే మొక్కలు, చెట్లను క్రమ పద్ధతిలో ఉంచుకోవాల్సిన ఆవశ్యకతను, లైటింగ్ వ్యవస్థ ప్రాముఖ్యాన్ని తెలియచేశారు. పండుగలు, సెలవలు వంటి సందర్భాలలో విలువైన నగలు, ఇతర వస్తువులను భద్రపరచటంలోనూ, వాటిని ధరించి బయటకు వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఇంకా, విద్యార్థులు స్కూల్స్ లో కంప్యూటర్ ఉపయోగించటంలోను, సైబర్ భద్రత విషయంలోను, బుల్లియింగ్ విషయంలోను మరియు ఇతర అంశాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలిపారు. అంతేకాక, అనుమానిత వ్యక్తులను గుర్తించినపుడు దూరం నుండే వారి గురించి వీలైనంత ఎక్కువ సమాచారం సేకరించి వెంటనే పోలీసులకు అందివ్వాలని సూచించారు.

అలాగే ఫ్రిస్కో పోలీస్ డిపార్ట్మెంట్ చేపడుతున్న వివిధ కమ్యూనిటీ అవగాహన కార్యక్రమాలు వివరించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 100 మందికి పైగా ఎంతో ఉత్సాహంగా హాజరై, చివరలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో పోలీస్ ఆఫీసర్ ల నుండి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కేవలం సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా, సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలను అందిస్తున్నందుకు అక్కడకు వచ్చిన అందరూ నాట్స్ డల్లాస్ చాప్టర్ సభ్యులను ప్రశంసించారు.

నాట్స్ డల్లాస్ కార్యవర్గ సభ్యులు చాప్టర్ కో అర్డినెటర్స్ రవి తాండ్ర, సత్య శ్రీరామనేని ఇతర సభ్యులు శ్రీధర్ న్యాలమాడుగుల, రవి తుపురాని, పార్థ బొత్స, శివ నాగిరెడ్డి, రవీంద్ర చుండూరు, గౌతమ్ కాసిరెడ్డిలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఔనాట్స్ అధ్యక్షులు బాపు నూతి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రాజేంద్ర మాదాల ఈ కార్యక్రమంలో పాల్గొని, మన కమ్యూనిటీకి ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలతో పాటు అనేక విజయవంతమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్న డల్లాస్ చాప్టర్ సభ్యులను ప్రత్యేకంగా ప్రశంసించారు.

అలాగే, నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి కూడా ఈ సందర్భంగా డల్లాస్ చాప్టర్ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్నాక్స్ మరియు టీ అందించిన స్వాగత్ బిర్యానీస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు. అలాగే, నాట్స్ డల్లాస్ చాప్టర్ కార్యక్రమాలకు పోషక దాతలు అయిన స్వాగత్ బిర్యానీస్, హిండ్ సైట్, కోపెల్ చెస్ క్లబ్ , ఫార్మ్ 2 కుక్, వైకుంట్ డెవలపర్స్, క్లౌడ్ జెనిక్స్, అజెనిక్స్, ఆర్కా చిల్డ్రన్స్ అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలియ చేస్తూ ముందు, ముందు మరిన్ని విలక్షణమైన సేవా, సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలియచేశారు.

(చదవండి: కువైట్‌లో వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement