మాజీ సైనికుల కు సీఎం వరాలు
మాజీ సైనికుల భృతి రూ.6000 పెంపు
సాక్షి, హైదరాబాద్ : మాజీ సైనికులకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు వరాలు ప్రకటించారు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.3000 గౌరవ భృతిని రూ.6000 పెంచుతున్నట్లు తెలిపారు. సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం మాజీ సైనికోద్యోగులు, కొందరు మాజీ పోలీసు అధికారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. వారితో కలిసి భోజనం చేశారు. సమావేశంలో మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డీజీపీ అనురాగ్‌శర్మ, సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనేష్‌కుమార్, కల్నల్ రమేష్‌కుమార్, మాజీ సైనిక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎం.సురేశ్‌రెడ్డి, రిటైర్డ్ ఐజీలు వి.భాస్కర్‌రెడ్డి, సి.రత్నారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రతిభ కనబరిచిన రాష్ట్రానికి చెందిన సైనిక అధికారులను వచ్చే రాష్ట్రావతరణ దినోత్సవాల్లో ఘనంగా సన్మానిస్తామన్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న మాజీ సైనిక ఉద్యోగులకు వారి జాగాల్లోగాని, ప్రభుత్వ భూముల్లోగాని బలహీనవర్గాల గృహనిర్మాణ పథకంలో భాగంగా ఇండ్లను రిజర్వు చేసి కేటాయిస్తామని చెప్పారు. వచ్చే బడ్జెట్‌లో నిధులిస్తామని, డీజీపీ, హోం సెక్రెటరీ, చీఫ్ సెక్రెటరీ, తాను కలిసి మాజీ సైనికుల సంక్షేమానికి ఒక వ్యూహం రూపొందిస్తామని సీఎం చెప్పారు. దేశ రక్షణకు పనిచేసినవారు తన దృష్టికి తీసుకు వచ్చిన సమస్యలు చాలా చిన్నవని, వాటన్నింటిని త్వరలోనే ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో పాలుపంచుకోవాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా మాజీ సైనికులు సీఎంకు వినతిపత్రాలు అందించారు. కెప్టెన్ డీజే రావు రచించిన బంగారు తెలంగాణ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు.