హైదరాబాద్‌లో చెత్త తరలింపు కోసం కొనుగోలు చేయనున్న ఆటోలను పరిశీలిస్తున్న కేసీఆర్
- సహకరించాలని నగర ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపు
- ఇంటింటా చెత్త సేకరణ కోసం వాహనాలు
- రూ. 100 కోట్లతో 2,500 ఆటో ట్రాలీలు
- బస్తీల్లో 1,500 ట్రై సైకిళ్లతో చెత్త సేకరణ
- బల్క్ గార్బేజ్ కోసం భారీ వాహనాలు
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛ హైదరాబాద్‌కు అవసరమైన నిధులు, వాహనాలు, ఇతర సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రజలు సమష్టి కృషితో నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడానికి సహకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. నగరంలో చెత్త సేకరణకు కొనుగోలు చేయనున్న ఆటో ట్రాలీ మోడళ్లను ముఖ్యమంత్రి శనివారం క్యాంపు కార్యాలయంలో పరిశీలించి ఆమోదించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ఆటో ట్రాలీల విశేషాలను సీఎంకు వివరించారు.
నగరంలో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించడానికి 2,500 ఆటో ట్రాలీలను ప్రభుత్వం సమకూర్చనుంది. ఒక్కో ట్రాలీ 600-700 ఇళ్లు తిరిగి రెండు క్యూబిక్ మీటర్ల చెత్తను సేకరించనుంది. తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఉంచడానికి అనువుగా ట్రాలీలో ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. తేలిగ్గా డంప్ చేయడానికి అనువుగా ఆటో లిఫ్టింగ్ సౌకర్యం, రోడ్లపై చెత్త ఎగిరి పడకుండా మూత ఉంటుంది. పరిశుభ్రత, పచ్చదనానికి సూచికగా ఆకుపచ్చ రంగులోనే వాహనాలను డిజైన్ చేయాలని సీఎం ఆదేశించారు. డ్రైవర్లకే ఈ ఆటో ట్రాలీలు కొనివ్వనున్నట్లు తెలిపారు.
ఒక్కో వాహనానికి రూ. 3.88 లక్షల చొప్పున రూ.వంద కోట్లు వీటి కోసం ఖర్చు చేస్తున్నామన్నారు. బస్తీల్లో చెత్త సేకరణకు 1,500 ట్రై సైకిళ్లు కొనాలని ఆదేశించారు. రెండు నెలల్లో ఆటో ట్రాలీలు, ట్రై సైకిళ్లు కొనాలన్నారు. వాణిజ్య, బల్క్ గార్బేజ్ సేకరణకు పెద్ద వాహనాలు ఏర్పాటు చేయాలన్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయడానికి వీలుగా 22 లక్షల చెత్తబుట్టలు కొనడానికి ఆర్డర్ ఇచ్చిన విషయం గుర్తుచేశారు. నగరవ్యాప్తంగా భవన నిర్మాణ శిథిలాలు, ఇతర వ్యర్థాలను తొలగించడానికి కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు పిలిచామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు.
సీవరేజీ పనులు వేగంగా, సమర్థవంతంగా జరగడానికి 18 పెద్ద స్వీపర్స్‌ను సమకూరుస్తున్నట్లు చెప్పారు. నగరాన్ని 420 యూనిట్లుగా విభజించి స్వచ్ఛ హైదరాబాద్‌ను గొప్పగా నిర్వహించామని, ప్రజలు ఉద్యమ స్ఫూర్తితో పాల్గొన్నారన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ ద్వారా ప్రభుత్వం దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరించడానికి, నగర ప్రజాప్రతినిధుల సూచనలు అమలు చేయడానికి రూ.200 కోట్లు విడుదల చేశామని, పనులు పురోగతిలో ఉన్నాయని కేసీఆర్ పేర్కొన్నారు.