ఎమ్మెల్యేల ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఇవ్వాలి
- స్వచ్ఛ హైదరాబాద్ సమీక్షలో సీఎంను కోరిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఈనెల 16 నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో తమ ప్రతిపాదనలకు ప్రాధాన్యమివ్వాలని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కోరారు. తమ ప్రతిపాదనల మేరకు అధికారులు స్పందించేలా ఆదేశాలివ్వాలని విన్నవించారు. నగరంలోని దాదాపు అన్ని నియోజకవర్గాల శాసనసభ్యులు గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆలస్యంగానైనా స్వచ్ఛభారత్‌లో భాగంగా నగరంలోని పారిశుధ్య సమస్యలపై దృష్టి సారించడం సంతోషకరమన్నారు.
మురుగునీరు, చెత్త చెదారం మొదలైన సమస్యలన్నింటినీ సీఎం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. మన పరిసరాలను పరిశుభ్రంగా, కాలనీలను పచ్చగా ఉంచుకునేందుకు శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాలుపంచుకోవాలని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ను పచ్చగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని, ప్రభుత్వం చేస్తున్న స్వచ్ఛ హైదరాబాద్‌కు సంపూర్ణ సహకారం అందిస్తామని బీజేపీ శాసనసభపక్ష నేత కె.లక్ష్మణ్ తెలిపారు. కంటోన్మెంట్‌లో పారిశుధ్య సమస్యలను పరిష్కరించి, సుందరంగా తీర్చిదిద్దేందుకు నిధులను ఇస్తామని సీఎం హామీ ఇచ్చినట్టు కంటోన్మెంట్ బోర్డు వైస్ చైర్మన్ సదా కేశవరెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే కనకారెడ్డి తెలిపారు.