సీఎం కేసీఆర్‌ది ఓట్ల రాజకీయం
వైఎస్సార్‌సీపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి
కుత్బుల్లాపూర్: ఎస్సీ వర్గీకరణ విషయంలో వైఎస్సార్ సీపీ పూర్తి మద్దతు ఉంటుందని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎస్సీల సంక్షేమానికి కృషి చేశారని ఆ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు బెంబడి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ ఎమ్మార్పీఎస్ మేడ్చల్ జిల్లా కన్వీనర్ ముత్యపాగ నర్సింగ్‌రావు తన అనుచరులతో వైఎస్సార్ సీపీలో చేరారు. వీరికి కలిసి జిల్లా కార్యాలయంలో బెంబడి శ్రీనివాస్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014కు ముందు, ఆ తరువాత సీఎం కేసీఆర్ ఎస్సీ వర్గీకరణ విషయంపై ఏ రోజూ మాట్లాడలేదని, తాజాగా అఖిలపక్షం పేరుతో హడావుడి చేస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు.
వైఎస్సార్‌సీపీ తెలంగాణలో బలపడుతోందన్నారు.ఏళ్ల తరబడి మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో పోరాటలు చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం, నేడు ఓట్ల రాజకీయాలు చేస్తోందని, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్తోందన్నారు. ఎస్సీ వర్గీకరణపై మొదటి నుంచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మద్దతు తెలుపుతున్నారని, వైఎస్సార్ సీపీని ఆహ్వానిస్తే తన క్రెడిట్ ఎక్కడ పోతుందోనన్న భయంతో కేసీఆర్ ఆహ్వానించలేదని ఎద్దేవ చేశారు. గతంలో జిల్లా పునర్విభజనలో ఇదే వైఎస్సార్‌సీపీకి ఆహ్వానం అందని కారణంగా కోర్టు సీఎం కేసీఆర్‌కు నోటీసులు పంపించిన విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మీసాల రెడ్డి, కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, గ్రేటర్ కార్యదర్శి గోవిందస్వామి, గాజులరామారం డివిజన్ అధ్యక్షుడు వీర్‌శెట్టి, నాయకులు రాజు, రమేష్ పాల్గొన్నారు.