ప్రజాభిప్రాయం మేరకే జిల్లాల ఏర్పాటు
ప్రజాభిప్రాయం మేరకే జిల్లాల ఏర్పాటు
Published Sat, Aug 20 2016 10:11 PM | Last Updated on Wed, Oct 3 2018 7:02 PM
హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్ను ఈ నెల 22న ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. జిల్లాల ఏర్పాటును అన్ని పార్టీలు స్వాగతించాయని, ప్రజాభిప్రాయం మేరకే కొత్త జిల్లాల ఏర్పాటు ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చేలోపు అవసరమైతే మరో రెండు సార్లు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో సైతం జిల్లాల ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ప్రస్తుతమున్న ముసాయిదాలో అవసరమైతే మార్పులు, చేర్పులు జరుగుతాయని కేసీఆర్ తెలిపారు. ఏ ప్రాంతం వారికైనా అభ్యంతరాలుంటే తెలియజేయొచ్చని, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని ప్రజలకు అనుకూలంగా ఉండేలానే జిల్లాల ఏర్పాటు ఉంటుందని సీఎం తెలిపారు. దసరా నుంచి కొత్త జిల్లాలు అమల్లోకి రానున్నట్లు తెలిపారు. కొత్త కోర్టులు ఏర్పాటయ్యే వరకు ప్రస్తుతమున్న వ్యవస్థ కొనసాగుతుందని కేసీఆర్ తెలిపారు. హైకోర్టు సీజేతో మాట్లాడాక కొత్త కోర్టులు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. సెంప్టెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నామని, మహారాష్ట్రతో నీటి విషయంలో ఒప్పందం చేసుకోనున్నట్లు వెల్లడించారు.
Advertisement