
సాక్షి, హైదరాబాద్:రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఒడిదుడుకులకు లోనవుతోంది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ప్రారంభించిన నాటి నుంచి పగటి వేళల్లో పెరుగుతూ రాత్రి పూట పతనమవుతోంది. రాష్ట్రంలోని 23 లక్షలకు పైగా వ్యవసాయ పంపుసెట్లను పగటి పూటే వినియోగిస్తుండటంతో పగలు సగటున 9,300 మెగావాట్లు డిమాండ్ నమోదవుతూ రాత్రి 6 వేల మెగావాట్లకు పడిపోతోంది. ఈ హెచ్చుతగ్గుల పరిణామాల నేపథ్యంలో అసలే క్లిష్టమైన విద్యుత్ గ్రిడ్ నిర్వహణ.. మరింత కష్టతరంగా మారుతోంది.
ట్రాన్స్‌కో అప్రమత్తం..
విద్యుత్ సరఫరా వ్యవస్థలో క్లిష్టమైన పనుల్లో విద్యుత్ గ్రిడ్ నిర్వహణ ఒకటి. క్షణక్షణం మారే డిమాండ్‌కు సమానంగా గ్రిడ్‌కు విద్యుత్ సరఫరా చేసి సరఫరా వ్యవస్థను కాపాడేందుకు ట్రాన్స్‌కో లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎల్డీసీ) నిరంతరం పని చేస్తూ ఉంటుంది. హెచ్చుతగ్గులతో విద్యుత్ సరఫరా చేస్తే గ్రిడ్ అకస్మాత్తుగా కుప్పకూలి రాష్ట్రంతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో సైతం విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. గ్రిడ్ కూలితే సరఫరా పునరుద్ధరణకు 24 గంటలకు మించి పడుతుంది. అయితే వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరాతో డిమాండ్ ఒడిదుడుగులకు గురవుతూ గ్రిడ్ నిర్వహణ మరింత క్లిష్టంగా మారింది. దీంతో గ్రిడ్ పరిరక్షణపై ట్రాన్స్‌కో మరింత అప్రమత్తతతో వ్యవహరిస్తోంది. గ్రిడ్ నిర్వహణపై అధికారులలో రోజూ గంటపాటు ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
బ్యాకింగ్ డౌన్ తీవ్రం
తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) ప్లాంట్ల నుంచి 2,882 మెగావాట్లు, సింగరేణి ప్లాంట్ల నుంచి 1,200, కేంద్ర విద్యుత్ కేంద్రాల నుంచి 2,300, ఛత్తీస్‌గఢ్ నుంచి 1,000, థర్మల్ పవర్‌టెక్ నుంచి 840, సౌర విద్యుత్ ద్వారా 3,100, పవన విద్యుత్ ద్వారా 108 మెగావాట్లు రాష్ట్రానికి సరఫరా అవుతోంది. వీటి నుంచి డిమాండ్‌కు తగ్గట్లు పగటి వేళల్లో గరిష్టంగా 9,300 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుండగా, రాత్రి వేళల్లో ఉత్పత్తిని 6 వేలకు తగ్గిస్తున్నారు. ప్రైవేటు, ఎన్టీపీసీ, సింగరేణి విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గించేందుకు 24 గంటల ముందే యాజమాన్యాలకు సమాచారమివ్వాలి. కానీ డిమాండ్‌లో హెచ్చతగ్గులు ఏర్పడుతుండటంతో ఉత్పత్తి తగ్గించుకోవడం సాధ్యం కాదని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. మెరిట్ ఆర్డర్ ప్రకారం తక్కువ ధర ఉన్న జెన్‌కో ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గించుకుంటున్నామన్నారు.