ఇకపై మృతుల నమూనాలు సేకరించండి
నేరాల దర్యాప్తులో ఉభయ రాష్ట్రాల డీజీపీలకు హైకోర్టు ఆదేశం
- దర్యాప్తు అధికారుల తీరుపై అసంతృప్తి
- మృతుల రక్తపు మరకలు, గోళ్లు వంటివి సేకరించాలని సూచన
- హత్య కేసులో కింది కోర్టు విధించిన జీవిత ఖైదు రద్దు
సాక్షి, హైదరాబాద్: హత్య, అత్యాచారం, కిడ్నాప్, శిశు హత్య, చట్ట విరుద్ధ గర్భస్రావం, పితృత్వ వివాదాలు తదితర కేసుల్లో దర్యాప్తు అధికారుల తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నేర నిరూపణలో కీలక పాత్ర పోషించే మృతుల ఒంటిపై ఉండే రక్తపు మరకలు, వెంట్రుకలు, గోళ్లు, సున్నిత కణజాలం, ధృడ కణజాలం నమూనాలను దర్యాప్తు అధికారులు సేకరించడం లేదని అభిప్రాయపడింది. మృతదేహాన్ని గుర్తించే విషయంలో ఈ శాంపిళ్లు అవసరమని, వీటిని తప్పనిసరిగా సేకరించేలా కిందిస్థాయి అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వాలని ఉభయ రాష్ట్రాల డీజీపీలను హైకోర్టు ఆదేశించింది.
న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. తన అత్తను హత్య చేసిన నేరంపై వరంగల్ జిల్లా, భీమారంకి చెందిన గోపు శ్రీనివాసరెడ్డి అలియాస్ పరంధాములుకు కింది కోర్టు విధించిన జీవిత ఖైదును రద్దు చేసింది. దర్యాప్తు అధికారులు మృతురాలి వెంట్రుకలు, గోళ్లు తదితరాలను సేకరించలేదని, దీంతో డీఎన్‌ఏ పరీక్ష ద్వారా మృతదేహాన్ని గుర్తు పట్టే అవకాశం లేకపోయిందని తీర్పులో పేర్కొంది. ప్రత్యక్ష సాక్ష్యాధారాలు లేని ఇటువంటి కేసుల్లో డీఎన్‌ఏ పరీక్ష ఎంతో కీలకమని, అందువల్లే తాము డీజీపీలకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నామని ధర్మాసనం తెలిపింది.
ఎటువంటి ఆధారాలూ లేవు...
గోపు శ్రీనివాసరెడ్డి తన అత్త లక్ష్మిని వరంగల్ రంగసాయిపేటలో ఉన్న బావిలో తోసి చంపేశాడంటూ పోలీసులు అతనిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ జరిపిన కింది కోర్టు శ్రీనివాసరెడ్డికి జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. తీర్పును సవాలు చేస్తూ శ్రీనివాసరెడ్డి హైకోర్టులో అప్పీల్ చేశా రు. దీనిపై ధర్మాసనం విచారణ జరిపి తీర్పు వెలువరించింది. కింది కోర్టు తీర్పును తప్పుపట్టింది. లక్ష్మి మృతదేహం బావిలో తేలుతున్నట్లు నెల రోజుల తర్వాత తెలిసిందని, అప్పటికే గుర్తుపట్టే స్థితిలో లేదని ధర్మాసనం పేర్కొంది. మృతురాలి కుమార్తె చెప్పిన సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకుని కింది కోర్టు తీర్పు చెప్పిందంది. మృతదేహం తన తల్లిదేనని ఏ ఆధారంగా కుమార్తె గుర్తుపట్టిందో చెప్పలేదని, అసలు అది లక్ష్మి మృతదేహమేనని చెప్పేందుకు ఎటువంటి ఆధారాలూ లేవని తెలిపింది. దర్యాప్తు అధికారి మృతురాలి గోళ్లు, వెంట్రుకల వంటివి సేకరించి ఉంటే డీఎన్‌ఏ పరీక్షకు ఆస్కారం ఉండేదని స్పష్టం చేసింది.