సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్‌కు చెందిన చెస్ట్ ఖాతా నుంచి రూ. 1,96,88,136 కాజేసిన కేసులో సుప్రియ ఎలిజబెత్ హెడింగ్ కీలక నిందితురాలని స్పష్టమవుతోంది. సికింద్రాబాద్‌లోని బ్రాంచ్‌లో ఖాతా తెరిచేందుకు ఆమె సమర్పించిన ఆధార్ కార్డు మార్ఫింగ్ చేసినదిగా తేలింది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు పరారీలో ఉన్న సుప్రియ కోసం గాలిస్తున్నారు. అపెక్స్ బ్యాంక్‌ను ఆన్‌లైన్‌లో దోచే యడానికి స్కెచ్ వేసిన సైబర్ నేరగాళ్లు ఈ నెల 2న సుప్రియ ఎలిజబెత్ అనే మహిళతో సికింద్రాబాద్ బ్రాంచ్‌లో ఖాతా తెరిపించారు. అందులో పద్మారావునగర్ అడ్రస్ పొందుపరుస్తూ తన ఆధార్‌కార్డును అడ్రస్ ప్రూఫ్‌గా ఇచ్చింది. దీన్ని సరిగ్గా పరిశీలించ కుండానే బ్యాంకు అధికారులు ఆమోదించేశారు. కర్ణాటకకు చెందిన ఆధార్‌కార్డును స్కాన్ చేసి, అందులో ముందు వైపు సుప్రియ పేరు, వెనుక వైపు చిరునామా ఉండే చోట పద్మారావునగర్‌ను చేర్చి ప్రింటౌట్ తీసినట్లు పోలీసులు తేల్చారు.
కాజేసిన డబ్బు పది బ్యాంకుల్లోకి తరలించి..
అపెక్స్ బ్యాంక్ చెస్ట్ ఖాతా నుంచి ఈ మొత్తాన్ని 102 లావాదేవీల్లో కాజేశారు. కొన్ని రోజులపాటు ఈ బదిలీలు జరిగాయి. అయితే రోజూ బ్యాంక్ అధికారులు తీసే బ్యాలెన్స్ షీట్‌లో తేడాలు కనిపించకుండా హ్యాకర్‌గా వ్యవహరించిన నైజీరియన్ జాగ్రత్తలు తీసు కున్నారు. ఆ లావాదేవీలు బ్యాలెన్స్ షీట్‌లోకి రాకుండా డిలీట్ చేసేయడంతో బ్యాంకు అధికారులు గుర్తించలేకపోయారు. కాజేసిన మొత్తంలో రూ.1.94, 88,136 హరియాణా, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళల్లోని ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీఎఫ్‌సీ, కోటక్ బ్యాంకుల్లో ఉన్న 10 ఖాతాల్లోకి మళ్లించి విత్ డ్రా చేసేశారు. వీటిలో బెంగళూరు, ఎర్నాకుళంలోని ఖాతాలు సుప్రియ పేరుతో, ఢిల్లీ లోని ఖాతా ఆమె తండ్రిగా ఆధార్‌కార్డులో పొందుపరిచి ఉన్న జార్జ్ హెడింగ్ పేర్లతో ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వీరితోపాటు నగరంలో ఉండి వెళ్లిన నైజీరియన్ విల్సన్ కోసమూ ముమ్మరంగా గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment