
‘కమ్యూనిటీ మీడియా’ కొనసాగించండి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి మరోసారి అరుదైన అవకాశం దక్కింది. యునెస్కో ప్రపంచవ్యాప్తంగా వివిధ అంశాలపై వివిధ దేశాల్లో తమ పరిశోధన ప్రాజెక్టులను చేపడుతోంది. ఇందులో భాగంగా కమ్యూనిటీ మీడియా ప్రాజెక్టు హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీకి 2011లో అప్పగించింది. ప్రస్తుతం ఆ ప్రాజెక్టును సెంట్రల్ యూనివర్సిటీ విజయవంతంగా నిర్వహిం చినందుకుగాను మరో నాలుగేళ్లు కొనసాగించేం దుకు యునెస్కో అనుమతి చ్చింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ అప్పారావు వెల్లడిం చారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టు కింద వివిధ మాధ్యమాలు, కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయడం, వారు స్వయం సమృద్ధి సాధించేందుకు తోడ్పాటును అందించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
ఇందులో భాగంగా మారుమూల గ్రామీణ ప్రజల కోసం కమ్యూనిటీ రేడియోను రూపొందించామన్నారు. దాంతోపాటు వివిధ అంశాల్లో ప్రజలను ప్రోత్సహించేందుకు, పౌర నియంత్రణకు, కమ్యూనిటీ పత్రికల ద్వారా ప్రజలను చైతన్యవంతులుగా ఎదిగేందుకు పరిశోధనలు చేసి టూల్స్ రూపొందించినట్లు వెల్లడించారు. అలాగే విధానాల రూపకల్పన, శిక్షణ ఇవ్వడం వంటి కార్యక్రమాలను నిర్వహించినట్లు వివరించారు. కమ్యూనిటీ మీడియా విభాగంలో జరిగే పరిశోధన ఫలాలు ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు యునెస్కో కృషి చేస్తోందన్నారు. పొరుగు దేశమైన భూటాన్‌లో ప్రొడ్యూసర్స్, టె క్నికల్ స్టాఫ్, స్టేషన్ మేనేజర్‌ల కోసం ఇటీవల కమ్యూనిటీ రేడియోపై పది రోజుల పాటు వర్క్‌షాప్ నిర్వహించామని తెలిపారు.
ఆఫ్రికాలోని ఐదు దేశాల వారు కమ్యూనిటీ రేడియో టూల్‌ను వినియోగించుకునేందుకు ముందుకు వచ్చారని, వారికి ఐదు భాషల్లో అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో కౌమారదశ బాలికలకు సమాజ స్థితిగతులు, మసలుకోవాల్సిన తీరుపై శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. ఇందులో ముఖ్యంగా మహిళల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. బంగ్లాదేశ్ కూడా తాము రూపొందించిన కమ్యూనిటీ రేడియో విధానాన్ని అనుసరిస్తోందన్నారు. ఈ సమావేశంలో కమ్యూనిటీ మీడియా ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న ప్రొఫెసర్ వినోద్ పావరాల, డాక్టర్ కంచన్, మాలిక్, వాసుకి బెలవాడి, నిర్మల్ విశ్వనాథ్ మాట్లాడారు.