వందల మంది విద్యార్థుల మార్కులు గల్లంతు
ఈసెట్ ఫలితాల్లో గందరగోళం..
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు ఇటీవల నిర్వహించిన ఈసెట్ ఫలితాల్లో గందరగోళం నెలకొంది. ఈనెల 6న తొలిసారి ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించగా.. సర్వర్ మొరాయించడంతో గందరగోళం తలెత్తడం, అర్ధరాత్రి వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే తరువాత ప్రకటించిన ఫలితాల్లోనూ వందల మంది విద్యార్థుల మార్కులు గల్లంతై అర్హత సాధించలేకపోయారు. సోమవారం ఆన్‌లైన్‌లో ఓఎంఆర్ జవాబు పత్రాలు అందుబాటులో ఉంచడంతో జరిగిన నష్టాన్ని విద్యార్థులు గుర్తించారు.
200 ప్రశ్నలకు జవాబులు రాస్తే 80–90 మార్కులకు సంబంధించినవే ఓఎంఆర్ జవాబు పత్రాల్లో ఉన్నాయి. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జేఎన్‌టీయూ వద్ద ఆందోళనకు దిగారు. ఇంత జరిగినా ఈసెట్ కన్వీనర్ అందుబాటులో లేకపోవడంతో వైస్ చాన్సలర్ వేణుగోపాల్‌రెడ్డికి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఈ వ్యవహారంపై కమిటీ వేసి పరిశీలన జరిపిస్తామని.. విద్యార్థులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని వైస్ చాన్సలర్ హామీ ఇచ్చారు.