మండలి నుంచి కాంగ్రెస్ వాకౌట్
కరువుపై ప్రభుత్వ సమాధానాన్ని తప్పుబట్టిన విపక్షాలు
♦ రాష్ట్రంలో వ్యవసాయ ఎమర్జెన్సీ ప్రకటించాలి: షబ్బీర్ అలీ
♦ అది కమీషన్ కాకతీయ: రాజగోపాల్‌రెడ్డి
♦ ధరల నియంత్రణ వ్యవస్థను తీసుకురావాలి: ఎంఐఎం ఎమ్మెల్యే అల్తాఫ్ రిజ్వీ
♦ కరువు సహాయక చర్యలు చేపడుతున్నాం: మంత్రి పోచారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులపై వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఇచ్చిన సమాధానంపై మంగళవారం శాసనమండలిలో విపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నాయని... 438 మండలాల్లో కరువున్నా, 231 కరువు మండలాలనే ప్రభుత్వం ప్రకటించిందని మండిపడ్డాయి. రాష్ట్రంలో వ్యవసాయ అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని డిమాండ్ చేశాయి. కరువుపై మంత్రి సమాధానం సరిగ్గా లేదంటూ నిరసన గా చేస్తూ కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు.
ఖరీఫ్‌కు ముందే ఇన్‌పుట్ సబ్సిడీ: పోచారం
మంగళవారం కరువు పరిస్థితులపై లఘు చర్చ సందర్భంగా తొలుత వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, సాగునీటి కల్పన, పశు దాణా, తదితర సంక్షేమ చర్యలు చేపడుతున్నామన్నారు. కరువు సహాయం కింద కేంద్రాన్ని రూ.3వేల కోట్లు కోరితే రూ.791 కోట్ల సహాయాన్ని ప్రకటించి, రూ.56కోట్లు విడుదల చేసిందన్నారు. కేంద్రం ఇచ్చినా, ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ.989 కోట్లను మే నెల తర్వాత ఇన్‌పుట్ సబ్సిడీగా రైతులకు అందజేస్తుందని ప్రకటించారు. ఇక నిబంధనల ఆధారంగానే కరువు మండలాలను నిర్ణయిస్తున్నట్లు తెలిపారు.
వర్షాభావ పరిస్థితులున్నపుడు మహిళా రైతులకు రెండు గేదెలు ఇచ్చే విధంగా రూ.150 కోట్లు బడ్జెట్ కేటాయించామని, 12 వేల మందికి దీనికింద సహాయం అందించామని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 1998 నుంచి జూన్ 1, 2014 వరకు మొత్తం 7,304 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక 462 మంది ఆత్మహత్య కేసులను త్రిసభ్య విచారణ సంఘం పరిశీలించిందని... 402 కేసుల్లో రూ.6లక్షల చొప్పున పరిహారాన్ని చెల్లించామని చెప్పారు.
వ్యవసాయ ఎమర్జెన్సీ ప్రకటించాలి
రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో కరువు పరిస్థితులున్నాయని, వ్యవసాయ అత్యవసర పరిస్థితి ప్రకటించాలని విపక్ష నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. మైనర్ ఇరిగేషన్‌లో ఉన్న అవినీతి మరెక్కడా లేదని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (కాంగ్రెస్) ఆరోపించారు. మిషన్ కాకతీయ కమీషన్ కాకతీయ అని విమర్శించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులు పూర్తయి రైతులకు నీళ్లు అందాలంటే పదేళ్లు పడుతుందని, అప్పటివరకు రైతుల ఆత్మహత్యలు ఆగుతాయా అని ప్రశ్నించారు. రూ.217 కోట్లు ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని పొంగులేటి సుధాకర్‌రెడ్డి కోరారు. కరువు నేపథ్యంలో ధరల నియంత్రణ వ్యవస్థను ఏర్పాటుచేయాలని, నిత్యావసరాల ధర లు పెరిగినందున రైతు బజార్ల ద్వారా సబ్సిడీపై అందించాలని ఎంఐఎం సభ్యుడు అల్తాఫ్ రిజ్వీ కోరారు. అనంతరం సభను ఆదివారానికి చైర్మన్ స్వామి గౌడ్ వాయిదా వేశారు.