‘ఆపరేషన్ ఉస్మానియా’ షురూ
పాత భవనాన్ని కూల్చేందుకు రంగం సిద్ధం
దాని స్థానంలోనే ట్విన్‌టవర్స్ నిర్మాణం
పర్షియన్ శైలిలో పరిపాలనా భవనం
కార్పొరేట్‌కు దీటుగా ఓపీ, ఐపీ బ్లాకులు
సిటీబ్యూరో: అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఉస్మానియా జనరల్ ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో తరచూ పైకప్పు పెచ్చులూడి పడుతుండటంతో రోగులు, సిబ్బంది ఆందోళనకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్య సేవలకు ఈ భవనం సురక్షితం కాదని జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ నిపుణులు తేల్చిచెప్పడంతో దానిని నేలమట్టం చేసి, అదే స్థానంలో మరో రెండు బహుల అంతస్తుల భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేగాకుండా పర్షియన్ శైలిలో పరిపాలనా భవనం, ఆపరేషన్ థియేటర్లు, ఇన్‌పేషెంట్ వార్డులు, అవుట్ పేషంట్ విభాగాలను కార్పొరేట్ ఆస్పత్రులకు తీసి పోని స్థాయిలో నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు వారసత్వ కట్టడాల జాబితా నుంచి ఉస్మానియాను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పురావస్తు మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది.
వారం రోజుల్లో ఖాళీ..తరలింపునకు ప్రతిపాదనలు సిద్ధం
అన్ని సవ్యంగా జరిగితే వారం రోజుల్లో ఆస్పత్రిని ఖాళీ చేయనున్నట్లు గురువారం ఆస్పత్రిని సందర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఇందుకుగాను అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జనరల్ మెడిసిన్, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, డీవీఎల్ జైల్ వార్డుల్లోని 316 పడకలను ఫీవర్ ఆస్పత్రికి, జనరల్ సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, పోస్టు ఓపీవార్డుల్లోని 356 పడకలను నిలోఫర్, మలక్‌పేట్, వనస్థలిపురం ఏరియా ఆస్పత్రులకు, ఆర్థోపెడిక్స్‌లోని 120 పడకలను కింగ్‌కోఠి ఆస్పత్రికి, న్యూరాలజీ వార్డులోని 46 పడకలను ఫీవర్, గాంధీ ఆస్పత్రులకు తరలించాలని భావిస్తున్నారు. ఆరోగ్యశ్రీవార్డులోని 19 పడకలను ఏరియా ఆస్పత్రికి, నర్సింగ్ స్కూల్‌ను వెంగల్‌రావునగర్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌కు, డెంటల్ కాలేజీని గాంధీ ఆస్పత్రికి తరలించాలని ప్రతిపాదనలు రూపొందించారు.
చారిత్రక నేపథ్యం ఇదీ..
అప్పటికే విదేశాల్లో ప్రాచుర్యంలో ఉన్న వైద్య విధానాలు, బోధనా పద్ధతులను భాగ్యనగరంలో అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో 4వ నిజాం నవాబ్ నసీరుద్దౌలా 1846లో ఆసుపత్రి నిర్మాణానికి సన్నాహాలు చేపట్టారు. ఆ తరువాత 1866లో ‘ఆఫ్జల్‌గంజ్ ఆసుపత్రి’ పేరుతో 5వ నవాబు అఫ్జల్‌ఉద్‌లా మూసీ నది ఒడ్డున ఒక చిన్న దవాఖానా కట్టించారు. 1908లో మూసీ వరదల్లో ఆ భవనం నేలమట్టమయ్యింది. దీంతో అప్పటి నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1925లో 27 ఏకరాల విస్తీర్ణంలో ప్రస్తుత ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని నిర్మించారు. అయితే ఆతరువాత పాలకుల నిర్ణక్ష్యం కారణంగా అది శిథిలావస్థకు చేరుకుంది. ఏళ్ల తరబడి పునరుద్ధరణ పనులు చేపట్టకపోవడంతో పెచ్చులూడి పడుతోంది. ఇటీవల పైకప్పు కూలిపడడంతో వైద్యలు గాయపడ్డారు. ఆ తర్వాత వార్డులో విధులు నిర్వహిస్తున్న ఓ నర్సు సహా ఇద్దరు రోగులు తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవల జనరల్ సర్జన్ విభాగంలో పైకప్పు కూలిపడడంతో వైద్యులు సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగడమేగాక ఉద్యోగ సంఘాలు సమష్టిగా ఉస్మానియా ఆస్పత్రి పరిరక్షణ కమిటీ పేరుతో జేఏసీ ఏర్పాటు చేశారు. కన్వీనర్ డాక్టర్ బి.నాగేందర్ నేతృత్వంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి సహా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను కలిసి సమస్యను వివరించారు. మంత్రి లక్ష్మారెడ్డి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో, అదే సమయంలో భవనంపై అధ్యయనం చేసిన జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ నిపుణులు అది ఏమాత్రం సురక్షితం కాదని స్పష్టం చేశారు.
వైఎస్ హయాంలోనే పునాది
వాస్తవానికి దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే నూతన భవనం నిర్మించాలని నిర్ణయించారు. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఏడు అంతస్తుల భవ నాన్ని నిర్మించాలని భావిస్తూ, 2009 లో రూ.5 కోట్లు మంజూరు చేశారు. ఆయన మరణం తర్వాత అధికారంలోకి వ చ్చిన రోశయ్య 2010లో రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన రాజీనామా తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మరో రూ.50కోట్లు కేటాయిస్తూ పైలాన్ కూడా ఏర్పాటు చేశారు. అయితే అందుకు ఆర్కియాలజీ విభాగం అభ్యంతరం చెప్పడంతో ఐదు అంతస్తులకు కుదించారు. తీరా పనులు ప్రారంభించే సమయంలో తాము ఖాళీ చేయబోమంటూ నర్సింగ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీనికితోడు పురావస్తుశాఖ అభ్యంతరం చె బుతుంటంతో చంచల్‌గూడ జైలు సమీపంలో నిర్మింస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అనేక ప్రతిపాదనలు, అడ్డంకులను దాటుకుని ఎట్టకేలకు కొత్త భవనం పనులకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వైద్యులు...
50 మంది ప్రొఫెసర్లు, 50 అసోసియేట్ ప్రొఫెసర్లు, 150 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 200 మంది పీజీలు, 800 ఇంటర్నీలు అందుబాటులో ఉన్నారు. 1975 నుంచి కొత్త నియమకాలు లేవు. సుమారు వంద మంది కాంట్రాక్ట్ ప్రతిపాదిన ప ని చేస్తున్నారు. శానిటేషన్ విభాగంలో 350 మందికిగాను 150 మంది విధులు నిర్వహిస్తున్నారు.