వేసవి తాపానికి చల్లటి ఐడియా!
మండుతున్న ఎండల్లో తిరిగి ఇంటికొచ్చాక గుక్కెడు చల్లని నీరు తాగితే ఆ హాయే వేరు.. కూరలు, కూరగాయలు, వివిధ ఆహార పదార్థాలు ఎండాకాలంలో తొందరగా పాడవుతుంటాయి. మరి వీటిని తాజాగా ఉంచుకోవాలంటే.. చల్లని నీరు కావాలన్నా.. అందరికీ అందుబాటులో ఫ్రిజ్‌లు ఉండవు కదా.. ఒకవేళ ఉన్నా కరెంట్ లేకపోతే ఇబ్బంది పడాల్సిందే.. అయితే ఈ సమస్యలకు టెక్నాలజీలు చెక్ పెడుతున్నాయి. కరెంటు అవసరం లేకుండా పనిచేసే రకరకాల శీతలీకరణ వ్యవస్థలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చేశాయి. వాటిల్లో కొన్ని..
వాకాటి..
ప్లాస్టిక్ గుడారం.. చిన్న మోటర్... లీటర్ నీళ్లు.. సోలార్ ప్యానెల్.. ఇదీ వాకాటి గురించి. కరెంట్ లేకుండా కూరగాయలను తాజాగా ఉంచే అద్భుతమైన పరికరం ఇది. చిన్న సన్నకారు రైతులు తాము పండించిన కూరగాయలను నిల్వ ఉంచుకోలేక తక్కువ ధరకే అమ్మేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. అలాంటి వారికి ఈ వాకాటి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిలో సౌర ఫలాకాల సాయంతో నీరు ఆవిరిగా మారి ప్లాస్టిక్ గుడారంలో ఉన్న కూరగాయలను తాజాగా ఉంచుతుంది. అదే సమయంలో లోపలి వేడి గాలిని ఓ చిన్న వెంటిలేటర్ తొలగిస్తుంది. దాదాపు 200 కిలోల వరకు కూరగాయలను కొద్ది రోజుల పాటు తాజాగా ఉంచవచ్చు. దీని వివరాలను http://www.wakati.org/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
మిట్టీ కూల్..
మన్సుఖ్‌భాయ్ రాఘవ్ భాయ్ అనే ఔత్సాహిక శాస్త్రవేత్త తయారు చేసిన ఈ మట్టి ఫ్రిజ్ ఇప్పటికే చాలా ఫేమస్. బంకమట్టితో తయారైన ఈ ఫ్రిజ్.. పాలను మూడు రోజుల పాటు చెడిపోకుండా ఉంచుతుంది. కూరగాయలను వారంరోజుల పాటు నిల్వ ఉంచవచ్చు. ఈ ఫ్రిజ్ పై భాగం నుంచి నీరు మట్టిలోకి వెళ్లి ఇంకిపోతూ లోపల చల్లగా ఉండేలా చేస్తుంది. మట్టి కుండపై నీరు పోస్తే చల్లగా అవుతుంది కదా.. అలాగే ఈ ఫ్రిజ్ పనిచేస్తుందన్న మాట. దీని వివరాలు www.mitticool.in వెబ్‌సైట్‌లో ఉన్నాయి.
బయోఫిల్టర్..
ఈ శీతలీకరణ పరికరాన్ని కోకాకోలా కంపెనీ, కొలంబియాకు చెందిన ఇంటర్నేషనల్ ఫిజిక్స్ సెంటర్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. దీనిపై ఉన్న మొక్కలకు నీరు పోస్తుంటే అడుగున ఉన్న చిన్న గది చల్లగా మారుతుంది. దీంతో ఇందులో ఉంచిన పానీ యాలు, కూరగాయలు చల్లగా ఉంటాయి. ప్రస్తుతం ఈ యంత్రాన్ని తమ ఉత్పత్తుల కోసమే ఉపయోగించుకుంటున్నా.. భవిష్యత్‌లో అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.