సాక్షి, సిటీబ్యూరో : ఆయా నియోజకవర్గాల్లోని ముఖ్యనేతల డుమ్మా.. హాజరైన నేతలు సైతం మొక్కుబడిగా కొద్దిసేపు మాత్రం కూర్చొని బయటకు వెళ్లిపోవడం.. అనంతరం పార్టీ అధ్యక్షుని పిలుపుతో మళ్లీ రావడం.. ఎవరూ వినిపించుకునే పరిస్థితి లేకపోవడంతో త్వరితగతిన సమావేశాన్ని ముగించడం.. ఇవీ బుధవారం జరిగిన హైదరాబాద్ జిల్లా టీడీపీ విస్తృతస్థాయి సమావేశ దృశ్యాలు. నియోజకవర్గ ఇన్‌చార్జి.. రానున్న ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు తదితర అంశాలు చర్చనీయాంశంగా మారిన తరుణంలో ఆయా నియోజకవర్గాలకు చెందిన నేతలు సమావేశానికి రాకపోవడం విశేషం.
ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి కె. విజయరామారావు, కంటోన్మెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి జి.సాయన్న, సనత్‌నగర్ నియోజకవర్గానికి చెందిన కూన వెంకటేశ్‌గౌడ్, అంబర్‌పేట నియోజకవర్గం నుంచి సి. కృష్ణయాదవ్, ఇంకా ఆయా నియోజకవర్గాల నుంచి పలువురు ముఖ్యనేతలు సమావేశానికి హాజరు కాలేదు. గైర్హాజరీకి సంబంధించి ఆరా తీసిన వారికి ఏవేవో కారణాలు చూపారు. వచ్చిన నేతలు సైతం కొద్దిసేపు కూర్చొని వెళ్లిపోయారు. సనత్‌నగర్ నియోజకవర్గ టికెట్‌ను ఆశించిన కూన వెంకటేశ్ పార్టీ తీరుపై బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తం చేయడం తెలిసిందే. విజయరామారావు సమావేశానంతరం గంటన్నరకు పార్టీ కార్యాలయానికి వచ్చారు.
నగరంలో పార్టీ పరిస్థితిపై వాకబు చేశారు. కూన వెంకటేశ్‌గౌడ్, పీఎల్ శ్రీనివాస్‌లలో ఎవరో ఒకరికి ఖైరతాబాద్ నియోజకవర్గ టికెట్ ఇస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి విజయరామారావు.. ఖైరతాబాద్‌కు ఇంకా నేనే ఇన్‌చార్జిగా ఉన్నానని మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ వ్యాఖ్యానించడం గమనార్హం. సమావేశానికి అధ్యక్షత వహించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు తలసాని ప్రసంగించి.. పనిమీద కొద్దిసేపు వేదిక దిగి వెళ్లగానే.. సమావేశంలోని వారంతా తలోదిక్కు వెళ్లిపోయారు.
తిరిగి వచ్చిన తలసాని పిలిచి కూర్చోబెట్టాల్సి వచ్చింది. అనంతరం నేతలు ఏంమాట్లాడుతున్నా వినిపించుకునే పరిస్థితి లేకపోవడంతో.. సమావేశాన్ని ముగిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రనేతలు, జిల్లా నేతలు, అనుబంధ విభాగాల నేతలు, కార్పొరేటర్లు భారీ సంఖ్యలో పాల్గొనాలని పార్టీ పిలుపునిచ్చినా ఆ మేరకు స్పందన కనిపించలేదు. మొక్కుబడి తంతుగా.. గందరగోళంగా మొత్తానికి సమావేశాన్ని మమ అనిపించారు. సమావేశంలో మాట్లాడిన నేతలు త్వరలోనే ఎన్నికలు రానున్నందున, పార్టీని గెలిపించేందుకు ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో పార్టీ నాయకులు ముఠాగోపాల్, పీఎల్ శ్రీనివాస్, వనం రమేశ్, ఎమ్మెన్ శ్రీనివాస్, ప్రేంకుమార్ ధూత్, టి.కృష్ణాగౌడ్, ఎన్.కిశోర్, శేషుకుమారి, బుగ్గారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం తలసాని విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజాసమస్యలపై ఈ నెల 16న హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో భాగంగా 23వ తేదీ నుంచి పాదయాత్రలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
‘దేశం’ విస్తృత సమావేశం గందరగోళం
Published Thu, Nov 14 2013 4:14 AM | Last Updated on Wed, Sep 5 2018 3:24 PM
Advertisement