
సర్కార్ వైఫల్యాలపై సీపీఐ సమరం
ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేయాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సీపీఐ నిర్ణయిం చింది. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం కావడాన్ని ప్రజలకు ఎత్తిచూపాలని భావిస్తోంది. ఈ మేరకు ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేయాలని బుధవారం ఇక్కడ జరిగిన ఆ పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్, కార్యవర్గ సమావేశాల్లో నిర్ణయించింది. రాష్ట్రంలో పార్టీ నిర్మాణ ముసాయిదాను కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి సమర్పించారు.
మోదీ ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోంది: సురవరం
వామపక్షాల బలాన్ని పెంచుకుని మతోన్మాదశక్తులను ఎండగట్టి భావసారూప్యత గల వ్యక్తులు, లౌకిక, ప్రజాతంత్ర శక్తులతో కలసి పోరాడాల్సిన అవసరం ఉందని సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై సీపీఐ భేటీల్లో ఆయన ప్రసంగించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రజలతోపాటు బీజేపీలో అంతర్గతంగా అసంతృప్తి పెరుగుతోందని అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం లేదన్నారు.