ప్రభుత్వమిస్తామన్న కౌలు మొత్తాన్ని తీసుకోండి
సీఆర్‌డీఏ రైతులకు హైకోర్టు సూచన
సాక్షి, హైదరాబాద్: జరీబు భూముల వివాదంలో సీఆర్‌డీఏ అధికారులు కౌలు కింద ఎంత మొత్తం చెల్లించాలని నిర్ణయించారో, దాన్ని తీసుకోవాలని రైతులకు హైకోర్టు సూచించింది. కౌలు తీసుకున్నంత మాత్రాన రైతుల హక్కులు, వాదనలకు భంగం వాటిల్లదని భరోసానిచ్చింది. అంతేగాక ఈ చెల్లింపులు తాము వెలువరించే తుదితీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టంచేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గతవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తమ గ్రామంలో కొన్ని సర్వేనంబర్లలో ఉన్న భూముల్ని మాత్రమే జరీబు భూములుగా పరిగణించడం అన్యాయమని, రెండుపంటలు పండుతున్న తమ భూముల్నీ జరీబు భూములుగా పరిగణించడంతోపాటు కృష్ణాయపాలెం గ్రామాన్ని సెమీ అర్బన్ విలేజ్‌గా పరిగణించి, ప్రయోజనాల్ని వర్తింపచేయాలంటూ కారుమంచి అనిల్‌కుమార్ అనే రైతు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వీఎస్సార్ ఆంజనేయులు వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం... హామీ ఇచ్చినట్టుగా కౌలు కింద చెల్లిస్తామన్న మొత్తాన్ని విడుదల చేయాలని అధికారుల్ని ఆదేశించింది. అంతేగాక ఆ మొత్తాన్ని తీసుకోవాలని పిటిషనర్‌కు సూచించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, సీఆర్‌డీఏ కమిషనర్, సీఆర్‌డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తదితరుల్ని ఆదేశించింది.