చాంద్రాయణగుట్ట: పాత నగరంలో ఏడాదిన్నర కాలంగా నిర్వహిస్తున్న కార్డన్ సెర్చ్ సత్ఫలితాలనిచ్చిందని దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపారు. ఇప్పటికే నేరాలు తగ్గుముఖం పట్టాయని, పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చే వరకు కార్డన్ సెర్చ్‌లను కొనసాగిస్తామని చెప్పారు. దక్షిణ మండలం పోలీసులు ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున నిర్వహించిన కార్డన్ సెర్చ్ వివరాలను ఆయన విలేకరులకు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలివీ.. ఫలక్‌నుమాలోని వట్టేపల్లి, గుంటల్ షా బాబా దర్గా ప్రాంతాలలో సుమారు 300 మంది పోలీసులు టీం టీంలుగా ఏర్పడి సోదాలు జరిపారు.
ఇందులో 17 మంది అనుమానిత రౌడీషీటర్లను అదుపులోకి తీసుకొని, వారి నుంచి రెండు తల్వార్లు, సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 50 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, ఒక స్కూల్ బస్సును స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలకు పాల్పడుతున్న కొందరు సరిహద్దు ప్రాంతంగా ఉన్న ఫలక్‌నుమా ఏరియాలో తలదాచుకుంటున్నారని డీసీపీ తెలిపారు. ఇటీవల కాటేదాన్‌లో బ్యాంక్ వద్ద కూడా కాల్పుల ఘటన నేపథ్యంలో ఇక్కడి ప్రజలు కార్డన్ సెర్చ్ నిర్వహించాలని తమను కోరారని వివరించారు.