నారా లోకేష్‌పై కేసు
టీఆర్‌ఎస్‌వీ ఫిర్యాదుతో నమోదు చేసిన పోలీసులు
నాగోలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేష్‌పై ఎల్బీనగర్ పోలీసు స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. తెలంగాణ రాష్ట్రప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కించపరిచేలా లోకేష్ వ్యాఖ్యానించాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వి.రాంనర్సింహగౌడ్ ఈనెల 15న చేసిన ఫిర్యాదు మేరకు 504, 505, 66/ఏ, ఐటీ యాక్ట్‌ల కింద కేసు నమోదు చేసినట్టు ఎల్బీనగర్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
తెలంగాణలో హిట్లర్ పాలన కొనసాగుతోందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఆంధ్రజ్యోతి పత్రికలో, తెలంగాణ ప్రభుత్వాన్ని రౌడీలు నడిపిస్తున్నారంటూ ట్విట్టర్‌లోను లోకేష్ పేర్కొన్నాడని రాంనర్సింహగౌడ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను అవమానపర్చడమేనని ఆయన ఆరోపించారు. ప్రజల్లో ద్వేషాన్ని నింపుతూ రెచ్చగొట్టేలా వాఖ్యలు చేసిన లోకేష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన సీఐని కోరారు. దీనిపై న్యాయపరమైన సలహాలు తీసుకుని కేసు నమోదు చేశామని, ఈ కేసును సైబరాబాద్ క్రైం విభాగానికి అప్పగిస్తామని సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
కేసు నమోదు చేయండి: మెజిస్ట్రేట్
రంగారెడ్డి జిల్లా కోర్టులు: తెలంగాణలో ప్రభుత్వాన్ని రౌడీలు నడుపుతున్నారంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని సైబరాబాద్ 2వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ మంగళవారం ఎల్బీనగర్ పోలీసులను ఆదేశించారు. లోకేష్ వాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ ఎల్బీనగర్ ఆర్టీసీకాలనీకి చెందిన న్యాయవాదులు రవికుమార్, అభిలాష్‌రావు మంగళవారం కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. ఫిర్యాదును స్వీ కరించిన సైబరాబాద్ 2వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ యూసుఫ్... 153ఏ, 153బీ, 295, 120బీ భారతీయ శిక్ష్మాస్మృతి కింద లోకేష్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.