మేయర్ పదవిపై చర్చోపచర్చలు
బీసీలకు దక్కుతుందో.. లేదోనని సందేహాలు
సిటీబ్యూరో: త్వరలో జరుగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠం ఎవరికి దక్కనుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అమలులో ఉన్న రొటేషన్ మేరకు మేయర్ పదవి ఈసారి బీసీలకు దక్కాల్సి ఉంది. అదే వర్తిస్తుందని మెజార్టీ నాయకుల అభిప్రాయం.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైనందున రొటేషన్ క్రమాన్ని తిరిగి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని మరికొందరి వాదన. ప్రస్తుతం గ్రేటర్‌లోని టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు వారి వారసుల కోసం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. బీసీలకే మేయర్ పీఠమైతే పోటీలో ఉండే నేతల వారసులు కొద్దిమంది మాత్రమే.గణనీయంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వారి ఆలోచనలకుఅనుగుణంగా వ్యవహరిస్తే ప్రభుత్వం ఆమేరకు చట్టాన్ని తేవాల్సి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోని చట్టాలను తెలంగాణలోనూ యథాతథంగా అమలుకు... వాటిలో సవరణలకూ అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఆసరా చేసుకొని.. ప్రభుత్వ పెద్దలు ఎవరికి అవకాశం ఇవ్వదల చుకుంటే అందుకనుగుణంగా చట్ట సవరణ చేసే వీలుం దని రాజకీయ పరిశీలకుల అంచనా. మేయర్‌గా ఇంతవరకూ బీసీలకు అవకాశం రాలేదు. రాకరాక వచ్చిన అవకాశాన్ని అడ్డుకుంటే వారి నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు వెల్లువెత్తే అంశాన్నీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొంటుందని... వ్యతిరేకతను కొనితెచ్చుకోబోదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే బీసీ గణనపై అనుమానాలు ఉన్నాయి. గ్రేటర్ జనాభాలో బీసీలను తక్కువగా చూపారని... ఇంటింటి సర్వే చేసినట్లు అధికారులు ప్రకటించినప్పటికీ... అది జరగలేదని టీడీపీ, బీజేపీలు ఎన్నికల కమిషనర్‌కు ఇప్పటికే ఫిర్యాదు చేశాయి. అవసరమైతే కోర్టుకు వెళ్లేందుకూ వెనుకాడేది లేదని ఆ పార్టీల నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీలకు కాకుండా మేయర్ పీఠాన్ని ఇతరులకు అప్పగించే యోచన చేయబోరని మెజార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయినా...అంతా ప్రభుత్వ పెద్దల ఇష్టం అనే వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మేయర్ పీఠం ఎవరికనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈనెల 8న బీసీల తుది జాబితాను వెల్లడించనున్నారు. ఆ తర్వాత 150 వార్డుల్లో ఏవి ఏయే వర్గాలకనేది రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. మేయర్ పీఠం ఎవరికనే అంశంలో కూడా అప్పుడే స్పష్టత వస్తుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటి వరకైతే పాత రొటేషన్ ప్రకారం మేయర్ పదవి బీసీలకే దక్కుతుందన్నారు. వివిధ రాజకీయ సమీకరణాలు, అధికార పార్టీ ఆలోచనలకు అనుగుణంగా జరగనున్న నిర్ణయం మేయర్ పీఠంపై ప్రభావం చూపనుంది. వార్డుల రిజర్వేషన్ల ఖరారు వరకు దీనిపై ఉత్కంఠ తప్పదు.