నేడే పట్టాభిషేకం | To arrange for the election of a full | Sakshi
Sakshi News home page

నేడే పట్టాభిషేకం

Published Thu, Feb 11 2016 12:04 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

నేడే పట్టాభిషేకం - Sakshi

నేడే పట్టాభిషేకం

మేయర్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
తొలుత పాలక మండలి ప్రమాణ స్వీకారం
తర్వాత మేయర్, డిప్యూటీల ఎన్నిక
విప్ జారీ చేసిన టీఆర్‌ఎస్

 
మహా నగర ప్రథమ పౌరుడి పట్టాభిషేకానికి గురువారమే ముహూర్తం. నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో... జీహెచ్‌ఎంసీ మొట్ట మొదటి మేయర్ నేడు పాలనా పగ్గాలు చేపట్టబోతున్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో... అధికార పీఠం అలంకరించబోయే వ్యక్తి ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. కొత్త పాలక మండలి కొలువు తీరుతుంది.
 
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. గురువారం ఈ ఎన్నిక  నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఘట్టం పూర్తి కాగానే డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ ఉంటుంది. అంతకంటే ముందు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమాల కోసం జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ హాల్‌ను సిద్ధం చేశారు. మేయర్ ఎన్నిక కోసం పార్టీల వారీగా కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు కూర్చునేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటినాలుగు వరుసలను ఎక్స్‌అఫీషియో సభ్యులకు... మేయర్ సీటుకు ఎడమ వైపున ప్రతిపక్షాలకు కేటాయించారు. మిగతా భాగంలో అధికార పార్టీ సభ్యులు ఆసీనులవుతారు. పార్టీల వారీగా తెలుగు అక్షరమాల క్రమంలో ఎవరెక్కడ కూర్చోవాలో ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు.

తొలుత కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం
కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులు తమకు అందిన నోటీసులు (ఆహ్వానాలు)తో హాల్‌లోకి ప్రవేశిస్తారు. రిజిస్టర్‌లో సంతకాలు చేస్తారు. తొలుత పాలక మండలి సభ్యులతో (కార్పొరేటర్లతో)  ప్రమాణ స్వీకారం చేయిస్తారు. నాలుగు భాషల్లో ప్రమాణం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, హిందీలలో ప్రమాణ పత్రాలు సిద్ధం చేశారు. తొలుత తెలుగులో చదవాలనుకున్న వారంతా ఒకేసారి చదివేలా ఏర్పాట్లు చేశారు. తర్వాత వరుసగా ఇంగ్లిష్, ఉర్దూ, హిందీలలో ప్రమాణాలు చేయిస్తారు.

ఈ కార్యక్రమం ముగియగానే మేయర్ ఎన్నిక నిర్వహిస్తారు. మేయర్ అభ్యర్థిత్వానికి ఒక సభ్యుడు పేరు ప్రతిపాదిస్తే... మరొకరు బలపరుస్తారు. పోటీలో ఒకే అభ్యర్థి ఉంటే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. లేని పక్షంలో ఎన్నిక నిర్వహిస్తారు. ఇద్దరు లేదా ముగ్గురు పోటీలో ఉంటే ఎవరికి ఓటు వేస్తున్నారో తెలిపేందుకు చేతులె త్తాల్సిందిగా ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి సూచిస్తారు. సభ్యుల కుర్చీలను పార్టీల వారీగా ఏర్పాటు చేశారు. అలా చేతులెత్తిన వారు ఎందరో లెక్కపెట్టి ఓట్లుగా పరిగణిస్తారు. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు ఎన్నికైనట్లు ప్రకటిస్తారు.

⇒డిప్యూటీ మేయర్‌నూ ఇదే పద్ధతిలో ఎన్నుకుంటారు. మేయర్ కంటే ముందు డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించడానికి వీలు లేదు.
⇒అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్లకు ఎన్నికైనట్లు ధ్రువపత్రాలు అందజేస్తారు. ఈ ప్రక్రియలన్నీ వీడియో చిత్రీకరిస్తారు. ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు మొత్తం కార్యక్రమం పూర్తి కాగలదని అంచనా.
⇒మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు దాదాపుగా ఏకగ్రీవంగా పూర్తి కాగలవనే భావిస్తున్నారు.


టీఆర్‌ఎస్ విప్ జారీ
 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేస్తాయి. ఎన్నికకు 24 గంటల లోపు పార్టీ అధ్యక్షుడు, లేదా ఆయన అధీకృతంగా నియమించిన వారు విప్ జారీ చేయవచ్చు. ఈ సమాచారాన్ని ప్రిసైడింగ్ అధికారికి తెలియజేస్తారు. గడువు ముగిసే సమయానికి (బుధవారం ఉదయం 11 గంటల లోపు) కేవలం టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నుంచి మాత్రమే విప్ జారీ అయినట్లు ప్రిసైడింగ్ అధికారి రాహుల్ బొజ్జా తెలిపారు. ఒకవేళ ఎవరైనా విప్‌ను ఉల్లంఘించినా వారి ఓటు చెల్లుబాటవుతుంది. దీనిపై ఎన్నికల సంఘం వివరణ కోరుతుంది. ఆ మేరకు తదుపరి చర్యలు తీసుకునే వీలుంది. విప్ ఉల్లంఘించిన వారు ఒకవేళ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటే.. విచారణ పూర్తయ్యాక  తుది తీర్పు ప్రకారం నడచుకుంటారు. అప్పటి వరకు వారి పదవికి ఢోకా ఉండదని సంబంధిత అధికారి తెలిపారు.
 
కోరం సంఖ్య 109
కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యుల సంఖ్య కలిపి మొత్తం 217 మందికి మేయర్, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకునేందుకు ఓటు హక్కు ఉంది. ఇందులో కనీసం 50 శాతం.. అంటే 109 మంది హాజరు ఉంటే కోరం ఉన్నట్లు లెక్క. ఈ మేరకు సభ్యులు ఉంటే ఎన్నిక నిర్వహిస్తారు. లేని పక్షంలో గంటసేపు వేచి చూచి... శుక్రవారానికి వాయిదా వేస్తారు.

⇒ మేయర్‌ను ఎన్నుకునేందుకు గెలిచిన కార్పొరేటర్లతో పాటు జీహెచ్‌ఎంసీలో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా అర్హులే. మేయర్ పదవికి పోటీ కి మాత్రం కార్పొరేటర్‌గా ప్రజలు ఎన్నుకున్న వారే అర్హులు.

⇒ఈ ఎన్నికలో ఓటు వేసే ఎక్స్‌అఫీషియో సభ్యులు గతంలో మరే కార్పొరేషన్‌లోనూ మేయర్ ఎన్నికలో తాము ఓటు వేయలేదనే డిక్లరేషన్‌పై సంతకం చేయాలి.
⇒ ప్రిసైడింగ్ అధికారి, అబ్జర్వర్ మాత్రమే ఎన్నికలను నిర్వహిస్తారు.

ఏర్పాట్లు పరిశీలన
 హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా ఉన్నారు. ఆయన, ఎన్నికల పరిశీలకుడు అశోక్ కుమార్ బుధవారం సాయంత్రం జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ హాల్‌లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు.              

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement