
‘కోట’లో కోలాహలం
బోనాలతో భారీగా తరలివస్తున్న భక్తులు
ఉత్సవాలపై విదేశీయుల ఆసక్తి
గోల్కొండ: గోల్కొండ కోట భక్తులతో కిటకిటలాడింది. కోటలో కొలువుదీరిన శ్రీ జగదాంబిక అమ్మవారి బోనాల ఉత్సవాల సందర్భంగా గురువారం రెండవ పూజ అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ‘అమ్మా.. చల్లంగ చూడ మ్మా..’అంటూ భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. మరికొందరు వర్షాలు కురవాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదిలా ఉండగా కోటలోని నగినాబాగ్ పూజా ఏర్పాట్లు, అమ్మవారి నైవేద్యం తయారీలతో సందడిగా మారింది. నెత్తిమీద అందంగా అలంకరించిన బోనంలతో మహిళలు సంప్రదాయ దుస్తుల్లో అమ్మవారి వద్దకు బారులుగా బయలుదేరారు.
మరోవైపు సంప్రదాయ డప్పు, డోలుపై యువకులు నృత్యాలు చేస్తూ మెట్ల మార్గం గుండా అమ్మవారిని దర్శించుకున్నారు. పాతనగరం నుంచి ప్రత్యేకంగా అలంకరించిన తొట్టెలను ఊరేగింపుగా తె చ్చి అమ్మవారికి సమర్పించారు. గోవింద్‌రాజ్ కోయల్‌కర్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు చంద్రశేఖర్ గడ్డి, చంద్రకాంత్, ఆలయ కార్యనిర్వహణాధికారి మహేందర్‌కుమార్ తదితరులు భక్తులకు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. పూజారులు అనంతచారి, బొమ్మల సాయిబాబచారి ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. ఇక కోటలో జరుగుతున్న బోనాలను విదేశీ సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. మన సంస్కృతీ సంప్రదాయాలను చూసి ముచ్చపడిపోతూ ఫోటోలు తీసుకుంటున్నారు. స్థానికులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు.