హైదరాబాద్: కృష్ణా జలాలపై ఎలాంటి వివాదం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో దిగ్విజయ్ సింగ్ పాల్గొన్నారు. అనంతరం దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ... ప్రాజెక్టులపై పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కరవు సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందన్నారు. రుణమాఫీని అమలు చేయకపోవడం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. పింఛన్లు మినహా ఏ హామీ పూర్తిగా అమలు కాలేదని విమర్శించారు. నెహ్రు,గాంధీ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూస్తోందంటూ బీజేపీపై దిగ్విజయ్ ధ్వజమెత్తారు. బోఫోర్స్ విషయంలో ఆరోపణలు చేసి ఇప్పటి వరకు రుజువు చేయలేదు.... ఇప్పుడు తాజాగా అగస్టా వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని బీజేపీ నాయకులపై మండిపడ్డారు.