పోలవరం అంచనాల పెంపు వెనుక మతలబు
దీని వెనుక భారీ కమీషన్లు దాగి ఉన్నాయి: దిగ్విజయ్
తిరుపతి అర్బన్: పోలవరం ప్రాజెక్టు అంచనాలను చంద్రబాబు ప్రభుత్వం రూ.16 వేల కోట్ల నుంచి రూ.44 వేల కోట్లకు పెంచడం వెనుక భారీ కమీషన్లు దాగి ఉన్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ఆరోపించారు. ఆ కమీషన్లతోపాటు రాజధాని అమరావతి నిర్మాణానికి స్వదేశీ నిర్మాణ కంపెనీలకు కాకుండా విదేశీ కంపెనీలకు పనులను కేటాయించడం వెనుక భారీ కుంభకోణం ఉందని ఆయన ఆరోపించారు. ఇలా ప్రతి ప్రాజెక్టు నిర్మాణంలోనూ లక్షల కోట్ల కమీషన్లను తమవారికి కట్టబెడుతూ రానున్న ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులను ఎరవేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చిన దిగ్విజయ్‌సింగ్ బుధవారం మాజీ ఎంపీ చింతామోహన్ నివాసంలో విలేకరులతో మాట్లాడారు.
ప్రజాసంక్షేమాన్ని మోదీ గాలికొదిలారు: టీడీపీ ప్రభుత్వం మద్దతిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీనీ నిలబెట్టుకోకపోగా ద్రవోల్బణాన్ని అరికట్టకుండా దేశంలో ధరల పెరుగుదలకు కారణమైందని దిగ్విజయ్ విమర్శించారు. ప్రజాసంక్షేమాన్ని నరేంద్రమోదీ గాలికొదిలి మతాలమధ్య విద్వేషాలు చెలరేగేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రదాడులకు ఊతమిచ్చిన సిమీ ఉగ్రవాదులు భోపాల్‌లోని అత్యంత రక్షణ కలిగిన జైలు నుంచి పరారవడం వెనుక కేంద్రప్రభుత్వ నిర్లక్ష్యధోరణి స్పష్టమవుతోందన్నారు. భోపాల్ సిమీ ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌పై ఎన్‌ఐఏ విచారణను జ్యుడీషియరీ పర్యవేక్షణలో చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.