హైదరాబాద్: స్వల్ప వివాదం చినికిచినికి గాలివానైంది. హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని వాల్మీకినగర్, సూర్యనగర్ ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వాల్మీకినగర్ బస్తీలోని రోడ్డుపై వివాహ విందును ఏర్పాటు చేసుకోవడంపై బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గొడవపడ్డారు. వారిని బస్తీవాసులు దూషించడంతో ఆగ్రహం చెందిన ఆ యువకులు చిక్కడపల్లి వెళ్లి సుమారు 50మందితో కలిసి వచ్చి బస్తీపై రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడ్డారు. బస్తీలో బీభత్సం సృష్టించి 2 కార్లు, 5 ఆటోలను ధ్వంసం చేశారు.
ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. వారందరినీ గాంధి, ఉస్మానియా ఆస్పత్రులకు తరలించారు. ఫంక్షన్‌లోని వంట పాత్రలను పడేసి కుర్చీలను విరగొట్టారు. అల్లరిమూకల్లో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవి ఫుటేజిని సేకరించారు. సెంట్రల్ జోన్ డీసీపీ డేవిడ్ జోయల్ హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.