బొమ్మాళి నేనైతే.. పశుపతి మీ అయ్యనా?
ఎంపీ కవితపై డీకే అరుణ ధ్వజం
- రెండు రోజుల నిరాహార దీక్ష విరమించిన డీకే, పొన్నాల, సంపత్
- గద్వాల, జనగామలను జిల్లాలుగా చేయాలని డిమాండ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ టీఆర్‌ఎస్ ఎంపీ కవితపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘నేను గద్వాల కోటలో బొమ్మాళినని కవిత మాట్లాడింది. గద్వాల కోటలో రాణిని ప్రజలంతా జేజమ్మా అని పిలిస్తే ఒక్క పశుపతి మాత్రమే బొమ్మాళి అంటాడు. అంటే పశుపతి ఎవరు? మీ అయ్య కేసీఆరా? అధికారం ఉందని, అడిగేవారు లేరని నోటికిష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు ఊరుకోరు. ఇప్పటికే ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ప్రజాగ్రహంలో కొట్టుకుపోతారు జాగ్రత్త’ అని అరుణ హెచ్చరించారు. గద్వాల, జనగామలను జిల్లాలుగా ప్రకటించాలని, అశాస్త్రీయంగా చేసిన జిల్లాల పునర్విభజనను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ డీకే అరుణ, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇందిరాపార్కువద్ద చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్ష ఆదివారంతో ముగిసింది.
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజ నర్సింహ డీకే, పొన్నాలతో పాటు నిరాహార దీక్షలో కూర్చున్న ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ తనను బొమ్మాళి అని ఎద్దేవా చేసిన నిజామాబాద్ ఎంపీ కవితపై నిప్పులు చెరిగారు. తనకు గద్వాల కోటతో సం బంధం లేదని, తానో రైతుబిడ్డనని అన్నారు. గద్వాలను జిల్లా చేయకుంటే అక్కడి నుంచే టీఆర్‌ఎస్ సర్కారు పతనం మొదలవుతుందని ధ్వజమెత్తారు. తుది నోటిఫికేషన్‌లో ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా గద్వాల, జనగామలను జిల్లాలుగా చేయాలని డిమాండ్ చేశారు. ఓడిపోయిన ఓ నాయకుడి కోసం వనపర్తిని జిల్లాగా చేసి, గద్వాల, ఆలంపూర్‌లను అందులో కలపడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.
న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం...
పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన పూర్తిగా కుట్రపూరితంగా జరిగిందని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల అభిప్రాయాలను తీసుకొని జిల్లాలను ప్రకటించాల్సి ఉండగా, కేసీఆర్ తన రాజకీయ లబ్ధి కోసం విభజిస్తున్నారన్నారు. జిల్లాల తుది నోటిఫికేషన్‌లో గద్వాల, జనగామ లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామ న్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన ప్రక్రియను కాంగ్రెస్ ఆహ్వానిస్తుందని, అయితే ప్రజల అభీష్టం మేరకే జిల్లాలను ప్రకటించాలన్నారు. శాస్త్రీయ పద్ధతిలో పునర్విభజన జరిగితే ఆందోళనలు జరగవన్నారు. గద్వాల, జనగామ, సిరిసిల్ల జిల్లాల కోసం ప్రజల పోరాటాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో కోర్టును ఆశ్రయిస్తామన్నారు. ప్రజల మధ్య తగాదాలు పెట్టేందుకే ఇష్టమున్నట్లుగా జిల్లాల విభజనకు పూనుకున్నారని మాజీ ఎంపీ వి.హన్మంతరావు అన్నారు. మహబూబ్‌నగర్ వంటి పెద్ద జిల్లా ను నాలుగుగా విభజించాలని, గద్వాలను జిల్లా చేయాలని అన్నారు. నిరాహార దీక్ష శిబిరాన్ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు నేతలు సందర్శించి సంఘీభావం ప్రకటించారు.