గ్రేటర్‌లో డబుల్ కసరత్తు..!
స్థలాల అన్వేషణలో అధికారులు
తొలివిడత 30 వేల ఇళ్లకు అంచనా
సిటీబ్యూరో: సంవత్సర కాలంలో లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం.. ఇటీవలి జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు దాదాపు 500 ఎకరాల స్థలం అవసరం. నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులు కాక జీహెచ్‌ఎంసీ దాదాపు రూ. 17 వేల కోట్లు ఖర్చు చేయాలి. ప్రభుత్వ హామీ మేరకు పనులు చేసేందుకు అధికారులు ప్రస్తుతం స్థలాన్వేషణ ప్రారంభించారు. ఇందుకుగాను జీహెచ్‌ఎంసీతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్ రెవెన్యూ అధికారులు స్థలాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్ని ప్రభుత్వ స్థలాలు ఖాళీగా ఉన్నాయి.. వాటిల్లో ఎన్ని అంతస్తుల్లో.. ఎన్ని ఇళ్లు నిర్మించవచ్చో అంచనా వేస్తున్నారు. తగిన స్థలం ఉంటే 15 అంతస్తుల్లో నిర్మించాలని యోచిస్తున్నారు. మరో వారం రోజుల్లో వీటన్నింటిపై ఓ అంచనాకు రాగలమని భావిస్తున్నారు. ఇప్పటికే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకోసం దరఖాస్తు చేసుకున్నవారు దాదాపు ఐదు లక్షల మంది ఉన్నారు.
ఖాళీ స్థలాల్లో ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు గుడిసెలు.. రేకులతో నిర్మించిన ఇళ్లు.. చిన్న ఇళ్లున్న స్లమ్స్‌లో వాటిని తొలగించి అక్కడివారికి అక్కడే డబుల్ బెడ్‌రూమ్ కట్టివ్వాలనేది మరో యోచన. ఇక శిఖం భూములైతే నిర్మాణానికి వీల్లేదు. దేవాదాయశాఖ భూములైతే స్వాధీనం చేసుకునేందుకు కోర్టు అనుమతి పొందాలి. ఇలా వివిధ రకాల పనులు ఉండడంతో అధికారులు ఆ దిశగా దృష్టి సారించారు. ఈవారం ఆరంభం నుంచి సర్వే చేపట్టిన అధికారులు అపార్టుమెంట్లుగా దాదాపు 30 వేల ఇళ్లు నిర్మించేందుకు స్థలాలు ఉన్నట్టు అంచనా వేశారు. అయితే వాటి పూర్వాపరాలు.. వాటిని జీహెచ్‌ఎంసీ పరం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు పూర్తిచేయాల్సి ఉంది.
9 ప్రాంతాల్లో గుర్తింపు
ఎన్నికల షెడ్యూలు వెలువడటానికి ముందు గ్రేటర్‌లోని అన్ని నియోజకవర్గాల్లోనూ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు లాంఛనప్రాయంగా శంకుస్థాపన చేసినప్పటికీ, ప్రస్తుతానికి 9 బస్తీల్లో మాత్రం నిర్మాణానికి వీలుందని గుర్తించారు. ఈ బస్తీల్లో 8570 ఇళ్లు నిర్మించేందుకు అవకాశముందని అంచనా వేశారు. వాటికోసం టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నారు. అంచనా వ్యయం రూ. 151 కోట్లు.గుర్తించిన బస్తీలు: హమాలీ బస్తీ, సయ్యద్‌సాబ్‌కా బాడా, సరళాదేవి నగర్, పిల్లిగుడిసెలు, జంగమ్మెట్, కాంగారినగర్, ధోబీఘాట్, ఇందిరానగర్, లంబాడి తండా.
ఒక్కో ఇంటికి రూ.7 లక్షలు..
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు నగరంలో ఒక్కో ఇంటికి రూ. 7 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో రూ. 1.5 లక్షలు కేంద్రం నుంచి రూ. 3.8 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్నాయి. మిగతా రూ. 1.7 లక్షలు జీహెచ్‌ఎంసీ వెచ్చించాలి. ఈ లెక్కన లక్ష ఇళ్లు నిర్మించాలంటే జీహెచ్‌ఎంసీపై పడే భారం దాదాపు రూ. 17 వేల కోట్లు. వీటిని ఎక్కడి నుంచి తెస్తారో స్పష్టత రావాల్సి ఉంది.
జీఐఎస్ మ్యాపింగ్..
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకోసం గుర్తించిన స్థలాలను జీఐఎస్ మ్యాపింగ్ చేయాలని భావిస్తున్నారు. తద్వారా ఏయే ప్రాంతాల్లో ఎన్ని అంతస్తులతో నిర్మించనున్నారు.. ఎక్కడ పనులు ఎంతమేర జరుగుతున్నాయి.. అక్కడ ఎదురవుతున్న ఇబ్బందులు తదితర విషయాలను కంప్యూటర్ నుంచే ప్రభుత్వ పెద్దలకు వివరించే వీలవుతుందని భావిస్తున్నారు. అందుకుగాను అన్నివిధాలా అనువుగా ఉండే ఆధునిక సాంకేతిక విధానాలను పరిశీలిస్తున్నారు.
2 లక్షల కుటుంబాలు..
తాజా అంచనాల మేరకు గ్రేటర్‌లోని 1466 స్లమ్స్‌లో రెండు లక్షల కుటుంబాలు ఉంటున్నట్టు అంచనా. వీరందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించేందుకు వారు ఉంటున్న ఇళ్లను కూల్చివేసి, అక్కడే కొత్తవి నిర్మించాలి. వ్యక్తిగతంగా ఉన్న ఇళ్ల స్థానే ఫ్లాట్స్‌లో ఉండేందుకు ఒప్పించాలి. ఇందుకు కొంత కసరత్తు అవసరమని భావిస్తున్నారు. ఇప్పటికే నిర్మించిన ఐడీహెచ్ కాలనీలోని ఇళ్లను చూసి చాలామంది ముందుకు వస్తున్నప్పటికీ, వ్యక్తిగత ఇంటిని కోల్పోయి అంతస్తుల్లో ఉండేందుకు నిరాకరిస్తున్నవారూ ఉన్నారు.