నాలాలు...మృత్యు ద్వారాలు | Drainage system... the gates of death | Sakshi
Sakshi News home page

నాలాలు...మృత్యు ద్వారాలు

Published Wed, Apr 15 2015 1:28 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

Drainage system... the gates of death

సాక్షి, సిటీబ్యూరో : ఎక్కడైనా వర్షం కురిసిందంటే భూగర్భ జలాలు పెరుగుతాయని జనం సంతోషిస్తారు. నగరంలో పరిస్థితి అందుకు భిన్నం. గట్టిగా నాలుగు చినుకులు పడితే.. ఏ నాలాలో పడి ఎవరు మృతి చెందారనే వార్త వినాల్సి వస్తుందోననే భయాందోళనలతో గడపాల్సి వస్తోంది. తాజాగా మరోసారి అదే దుస్థితి ఎదురైంది. రెండు రోజుల వర్షానికి నాలుగు ప్రాణాలు నీళ్లలో కలిసిపోయాయి. ప్రతిసారీ ఇదే పరిస్థితి పునరావృతం. అయినా... నివారణ చర్యలు లేవు. దుర్ఘటనలు సంభవించినపుడు అధికారుల హడావుడి ప్రకటనలు తప్ప ఆ తర్వాత చర్యలు శూన్యం. దీంతో పరిస్థితి షరా మామూలే.

వానొస్తే మృత్యువు వచ్చినట్టే...
గత నవంబర్‌లో సత్యవేణి.. అంతకు రెండు నెలల ముందు హిమాయత్‌నగర్‌లో మరొకరు.. కొన్నేళ్ల క్రితం అంబర్‌పేటలో బ్యాంకు ఉద్యోగిని.. ఇలా నగరంలో వాన వచ్చిన ప్రతిసారీ ప్రజల ప్రాణాల మీదకు వస్తోంది. వరదొస్తే గోదారులయ్యే రాదారులు.. కనిపించని నాలాలు... మ్యాన్‌హోళ్లు. వర్షం కురిస్తే నీరు సాఫీగా వెళ్లే మార్గం లేదు. నాలాలపైనేఅంతస్తులకు అంతస్తులు వెలియడంతో ఈ దుస్థితి నెలకొంది. ప్రతిసారీ వర్షాకాలంలో కనిపించే ఈ దుర్ఘటనలు ఈసారి వేసవిలోనే చోటు చేసుకున్నాయి. వర్షాకాలం నాటికే నాలాల్లో పూడిక తీత, సాఫీగా నీటి సరఫరా వంటి పనులు చేయలేని యంత్రాంగం వేసవిలో ఎలా ఉంటుందో తెలిసిందే.  అనూహ్యంగా కురిసిన వర్షానికి అమాయకులప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

శాశ్వత పరిష్కారం ఎప్పుడో..
నగరంలో ఏ రోడ్ల కింద ఎన్ని నాలాలు ఉన్నాయి? ఎక్కడఏ గండం పొంచి ఉంది?  ఏ చెరువులు ఎంత మేర కబ్జాకు గురయ్యాయి? ఎక్కడ ఎన్ని పైప్‌లైన్లు ఉన్నాయి? డ్రైనేజీ లైన్లు ఎక్కడున్నాయి? నీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? సివరేజి  నీరు ఏ ప్రాంతాల్లో వరదనీటి కాలువల్లో కలుస్తోంది? అందుకు కారణాలేమిటి? ఈ సమాచారం జీహెచ్‌ఎంసీ వద్ద లేదు. గ్రేటర్‌లో ఏ రహదారి పరిస్థితి ఏమిటో? ఏ ఫ్లై ఓవర్‌కు పొంచి ఉన్న ప్రమాదమెంతో... ఏ శిథిల భవనం ముప్పు ఎంతో  తెలుసుకొని... ప్రమాదాలు నివారించాలనే ధ్యాస లేదు.

ఆస్తిపన్ను వసూళ్లు, డస్ట్‌బిన్ల నుంచి చెత్త తొలగింపు, అక్రమ  నిర్మాణాల గుర్తింపు వంటి పనులకు ఐటీని వినియోగించుకోవడంలో ముందంజలో ఉన్న జీహెచ్‌ఎంసీ ఏ రోడ్డు పరిస్థితి ఏమిటో చెప్పగలిగే స్థితిలో లేదు. ఎన్ని నాలాలు అన్‌కవర్డ్ (రోడ్లు, బ్రిడ్జిల కింద)గా  ఉన్నాయో అంచనాలు తప్ప... సరైన లెక్కల్లేవు. ఏ నాలా ఎప్పుడు నిర్మించారో...ఎప్పుడు మరమ్మతులు చేశారో తెలియదు. వాటి జీవిత కాలమెంతో తెలియదు. రహదారులు చెరువులైనప్పుడో, రోడ్లు కుంగినప్పుడో తప్ప నాలాల స్థితిగతులను కానీ, వాటి మరమ్మతుల గురించి కానీ పట్టించుకోవడం లేదు.

లెక్కలన్నీ అంచనాలే...
గ్రేటర్‌లోని రహదారుల కింద వివిధ ప్రాంతాల్లో దాదాపు 30 పెద్ద నాలాలు ఉన్నట్లు అంచనా. ఇవి 60 కి.మీ.ల మేర ఉన్నాయనే అంచనాలు తప్ప కచ్చితంగా ఎక్కడున్నాయో తెలియదు. వీటి వల్ల సమీప రహదారులకు ప్రమాదం పొంచి ఉంది.. ఎప్పటికప్పుడు  తనిఖీలు, అవసరమైన చర్యలు లేనందువల్లే రెండేళ్ల క్రితం నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి వద్ద, నెక్లెస్ రోడ్డుల్లో రహదారులు కుంగిపోయాయి. మోడల్ హౌస్ వద్ద రోడ్డు కుంగడానికి వరదనీటి కాలువలో మురుగు నీరు పొంగి ప్రవహించడమే కారణమని అప్పట్లో భావించారు.

చాలినన్ని లైన్లు లేకపోవడంతో చాలా వరకు సివరేజి కూడా వరదనీటి కాలువల్లో కలుస్తోందని తెలిసినా... ఇటు జీహెచ్‌ఎంసీ కానీ.. అటు వాటర్‌బోర్డు కానీ తగిన చర్యలు తీసుకోలేదు. ఈ రెండింటి మధ్య సమన్వయం లేకపోవడం కూడా ఇందుకు కారణం. ఇటీవలే వివిధ శాఖలతో సమన్వయానికి చర్యలు ప్రారంభించారు.

రోడ్లదీ అదే దుస్థితి
నగరంలో ఎన్ని బీటీ రోడ్లు ఉన్నాయి?  ఏ రోడ్డు బలమెంత..? అంటే  వెంటనే సమాధానం చెప్పగలిగే స్థితిలో జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు లేరు. దీన్ని నివారించేందుకు రోడ్ నెట్‌వర్క్ డేటాబేస్ తయారీకి సిద్ధమైనప్పటికీ ముందుకు సాగలేదు.  జీహెచ్‌ఎంసీ పరిధిలో దాదాపు 8వేల కి.మీ.ల మేర రోడ్లు ఉన్నట్లు చెబుతున్న అధికారులు తొలిదశలో వెయ్యి కిలోమీటర్ల మేర డేటాబేస్ రూపకల్పనకు సిద్ధమయ్యారు. అందుకు నియమించిన ప్రైవేట్ కన్సల్టెంట్ నివేదిక ఇచ్చినప్పటికీ, తదుపరి చర్యలపై శ్రద్ధ చూపలేదు.

రూ.వందల కోట్లు ఖర్చవుతున్నా...
నగరంలో రోడ్లు త్వరితంగా దెబ్బ తినేందుకు ప్రధాన కారణం వర్షపు నీరు వెళ్లే మార్గాలు లేకపోవడమే. పైప్‌లైన్లు, కేబుల్ పనులు చేసినప్పుడు వెంటనే పూడ్చడం లేదు. రోడ్ల ప్యాచ్‌వర్క్‌లు, పాట్‌హోల్స్ మరమ్మతులు ఎప్పటికప్పుడు చేయాలి. అదీ జరగడం లేదు. ఏటా రూ.250- రూ.300 కోట్ల వరకు రోడ్ల కోసం ఖర్చు చేస్తున్నా ప్రజల ఇబ్బందులు తగ్గడం లే దు. రోడ్లపై నీటి నిల్వకు కారణం వరదనీటిని తట్టుకునే సామర్ధ్యం నాలాలకు లేకపోవడమే. వీటి ఆధునికీకరణ పనులకు నిధులు మంజూరైనా ఏడె నిమిదేళ్లుగా ముందుకు సాగడం లేదు.

నాలాల విస్తరణ పూర్తి కాకుండా ఏ చర్యలు తీసుకున్నా నిష్ర్పయోజమని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు నగరంలోని నాలాలు చాలావరకు కబ్జాలకు గురయ్యాయి. 30 అడుగుల వెడల్పు ఉండాల్సినవి 7 అడుగులకు కుంచించుకుపోయాయి. వీటి ఆధునికీకరణకు జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ద్వారా రూ.266 కోట్లు మంజూరై... పథకం కాల వ్యవధి ముగిసిపోయింది. పనులు 25 శాతం కూడా జరగలేదు.

కొత్త సర్కారైనా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ నాలాల ఆధునికీకరణకు రూ. 10వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తామన్నారు. ఇంతవరకు దానికి సంబంధిం చిన కార్యాచరణ ప్రారంభం కాలేదు.  హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు శ్రద్ధ చూపుతున్న సర్కారు నాలాలపై అంతకంటే ముందే దృష్టి పెట్టాల్సి ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

అమలు ఎప్పుడో..
తొలిదశలో 350 కి.మీ.ల మేర నాలాలను అభివృద్ధి చేయాలని గత నవంబర్‌లో నిర్ణయించారు. దశల వారీగా పనులు చేయాలనుకున్నారు. ఇందుకు ఇద్దరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఇంజినీర్లు, సర్వేయర్లతో ప్రత్యేక బృందాలను నియమించామని తెలిపారు. కానీ వారెక్కడ పని చేస్తున్నారో తెలియడం లేదు. రోడ్లపై నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ చెప్పారు.

అంతలోనే..
భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ జీహెచ్‌ఎంసీ యంత్రాంగం సకాలంలో స్పందించడం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని  కమిషనర్ సోమేశ్ కుమార్ చెప్పారు. మంగ ళవారం ఉదయం ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేసిన ఆయన జీహెచ్‌ఎంసీ అధికారులను అభినందించారు. అనంతరం వాన కష్టాలతో ప్రాణాలు పోయిన ఘటనలు వెలుగుచూశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement