ప్రమాదాలకు లైసెన్స్!
►ఫిట్‌లెస్ పరీక్షలు
►డ్రైవింగ్ ట్రాక్‌లలో మొక్కుబడి తంతు
►డ్రైవర్ల సామర్ధ్యంపై అవగాహన లేకుండా లైసెన్సుల జారీ
►పెరుగుతున్న యాక్సిడెంట్లు
గ్రేటర్ పరిధిలో డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ ప్రక్రియ ప్రహసనంగా మారుతోంది. ఎలాంటి సామర్థ్య పరీక్షలు నిర్వహించకుండానే విచ్చల విడిగా డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేరుకు అధునాతన డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లు ఉన్నా..వాటిపై ఎలాంటి పరీక్షలు నిర్వహించడం లేదని తెలుస్తోంది. రోజుకు మొక్కుబడిగా 20 మందికి పరీక్షల ద్వారా లైసెన్స్‌లు ఇస్తూ... వందలాది మందికి ఎలాంటి పరీక్షలు లేకుండానే జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల సరైన డ్రైవింగ్ నైపుణ్యం లేకుండానే వాహనదారులు రోడ్డెక్కుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. పరిశీలించి లైసెన్సులు అందజేయవలసిన ఈ ట్రాక్‌లో రోజుకు 20 మంది అభ్యర్థులకు కూడా పరీక్షలు నిర్వహించడం లేదు.
వందలాది మంది ఈ కార్యాలయం నుంచి డ్రైవింగ్ లైసెన్సులు తీసుకుంటారు. కానీ పరీక్షలకు హాజరయ్యేవాళ్లు చాలా తక్కువ మంది. పైగా ఈ డ్రైవింగ్ పరీక్షలు సైతంఅధికారుల పర్యవేక్షణ లేకుండా మొక్కుబడిగా జరిగిపోతాయి. ఒక్క ఇబ్రహీంపట్నం ఆర్టీఏ కార్యాలయంలోనే కాదు. గ్రేటర్ హైదరాబాద్‌లోని మరికొన్ని డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లలో కూడా ఇదే పరిస్థితి. వాహనాలు నడిపే వ్యక్తుల డ్రైవింగ్ సామరŠాధ్యనికి ఎలాంటి శాస్త్రీయమైన పరీక్షలు లేకుండానే లైసెన్సులు వచ్చేస్తున్నాయి. కొన్ని చోట్ల ఒక్కసారి లెర్నింగ్ లైసెన్సు కోసం వస్తే చాలు. ఇక డ్రైవింగ్ లైసెన్సు కోసం మరోసారి పరీక్షలకు హాజరుకావలసిన అవసరమే లేదు. ఇలా లైసెన్సులు తీసుకొని హై వేలలో రవాణా వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు తరచుగా ప్రమాదాలకు కారణమవుతున్నారు. రహదారి భద్రతకు అతి పెద్ద సవాల్‌గా మారుతున్నారు. మితిమీరిన వేగం, నిబంధనల పట్ల సరైన అవగాహన లేకపోవడం, వాహనాలను అదుపు చేసే సామర్ధ్యం కొరవడడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఆర్‌ఎఫ్‌ఐడీ కూడా అంతేసంగతులు...
మరోవైపు బెంగళూర్ నగరంలోని 9 డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లను రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌ఐడీ) పరిజ్ఞానంతో అనుసంధానించినట్లుగానే నగరంలోని ఉప్పల్, నాగోల్ ట్రాక్‌లను అనుసంధానించేందుకు ఏర్పాట్లు చేశారు. పూనేకు చెందిన ఓ సాంకేతిక సంస్థ సహకారంతో ఉప్పల్ ట్రాక్‌లలో ఆర్‌ఎఫ్‌ఐడీ ఏర్పాటు చేశారు. యాంటీన్నా ద్వారా ట్రాక్‌లలో వాహనం కదలికలను కంప్యూటర్‌లో నమోదు చేసే శాస్త్రీయ పరిజ్ఞానం మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఆ ప్రాజెక్టు ముందుకు సాగకుండా అప్పట్లో అనేక రకాల ఆటంకాలు చోటుచేసుకున్నాయి. దీంతోరూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఆర్‌ఎఫ్‌ఐడీని శాశ్వతంగా వదిలేశారు.
ప్రత్యక్ష పరీక్షలకు సెలవ్...
డ్రైవర్ల నైపుణ్యాన్ని పరీక్షించేందుకు గతంలో విదేశీ తరహాలో ప్రత్యక్ష పరీక్షా పద్ధతి ఉండేది. ట్రాక్‌లలో కాకుండా ప్రధానరహదారులలో డ్రైవర్ వాహనాన్ని నడిపేటప్పుడు మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్.. డ్రైవర్‌తో పాటు వాహనంలో పయనిస్తూ అతన్ని నైపుణ్యాన్ని పరీక్షించేవాడు. అభ్యర్ధులు వాహనం నడిపే తీరు, వేగం, వాహనం కండీషన్, పార్కింగ్ చేసే పద్ధతి, వాహనాన్ని వెనక్కి తీసుకోవడం, ఎత్తైన ప్రాంతాల్లో, కచ్చా రోడ్లపైన, ట్రాఫిక్ రద్దీలో నడిపేటప్పుడు పాటించవలసిన జాగ్రత్తలపైన ఈ పరీక్షలు ఉండేవి. ప్రస్తుతం బ్రిటన్ వంటి యూరోప్ దేశాల్లో కచ్చితంగా అమలవుతున్న ఈ విధానిన్ని ఇక్కడ రద్దు చేశారు. దీంతో డ్రైవింగ్ లైసెన్సుల జారీ ఎలాంటి పర్యవేక్షణ లేని ఒక ప్రహసనంగా కొనసాగుతోంది.
నగరంలోని ట్రాక్‌లు –అందజేసే లైసెన్సులు...
గ్రేటర్ హైదరాబాద్‌లో ఉప్పల్, నాగోల్, కొండాపూర్, మేడ్చెల్, ఇబ్రహీంపట్నంలలో డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లు ఉన్నాయి.ఈ ట్రాక్‌లలో ‘హెచ్’, ‘ఎస్’, ‘రివర్స్ యు’ ‘8’ వంటి ఆకృతులలో ట్రాక్‌లను నిర్మించారు. ఈ ట్రాక్‌లలోనే ద్విచక్ర వాహనదారులకు, మోటారు వాహనాలకు పరీక్షలు నిర్వహించి లైసెన్సులు ఇస్తారు.సాధారణంగా ఈ పరీక్షలు ఎంవీఐల ప్రత్యక్ష పర్యవేక్షణలో జరగాలి. కానీ మొక్కుబడిగానే ఈ పర్యవేక్షణ ఉంటుంది. నాగోల్, కొండాపూర్‌లలో రోజుకు సుమారు 500 డ్రైవింగ్ లైసెన్సుల చొప్పున జారీ అవుతుండగా, మిగతా చోట్ల 300–350 వరకు ఇస్తున్నారు.
జాడలేని వీడియో సెన్సర్‌లు....
వీడియో ఆధారిత సెన్సర్‌లను వినియోగించడం ద్వారా శాస్త్రీయమైన పద్ధతిలో డ్రైవింగ్ సామర్ధ్య పరీక్షలను నిర్వహించేందుకు రవాణాశాఖ 2 సంవత్సరాల క్రితం ప్రణాళికలను రూపొందించింది. కేరళలో విజయవంతంగా అమలవుతున్న ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్‌ల తరహాలో నగరంలోని నాగోల్, ఉప్పల్, కొండాపూర్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాలను ఆధునీకరించాలని అప్పట్లో ప్రతిపాదించారు. ఏజెంట్‌లు, డ్రైవింగ్ స్కూళ్ల ప్రమేయం లేకుండా అభ్యర్థుల నైపుణ్యాన్ని కచ్చితంగా అంచనా వేయవచ్చునని భావించారు.
ఈ మేరకు ఆర్టీఏ అధికారులు అప్పట్లో త్రివేండ్రమ్‌తో పాటు మరికొన్ని నగరాల్లోని వీడియో సెన్సర్‌లే కీలకంగా పనిచేసే ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాలను పరిశీలించారు. వీడియో సెన్సర్‌ల ద్వారా డ్రైవింగ్ నైపుణ్యాన్ని కచ్చితంగా అంచనా వేసేందుకు అవకాశం ఉన్నట్లు గుర్తించారు. కేరళ ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాలను నిర్వహిస్తున్న కెల్ట్రాన్ అనే సంస్థ భాగస్వామ్యంతోనే ఇక్కడ సైతం డ్రైవింగ్ కేంద్రాలను నిర్వహించాలని ప్రతిపాదించినా ఫలితం లేదు.