డ్రంక్ ఎన్ డు!
ఇన్నేళ్లుగా ఇండస్ట్రీని ఏలుతున్న మెగాస్టార్ అమితాబ్‌బచ్చన్ ఇన్నాళ్లకు ఓ కొత్త విషయం చెప్పాడు. ‘షరాబీ, దో అంజానీ, అమర్ అక్బర్ ఆంటోని, హమ్’ తదితర చిత్రాల్లో తాగుబోతు సీన్లలో అదరగొట్టిన అమితాబ్... అవన్నీ మద్యం సేవించకుండానే చేశానన్నాడు. ప్రస్తుతం ధనుష్, అక్షరతో కలసి చేసిన ‘షమితాబ్’ సినిమాలోనూ బిగ్ బీ రోల్ ఇంచుమించూ అలాంటిదే.
ఈ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న అమితాబ్... ‘మందు ముట్టుకోకుండానే ఆ సన్నివేశాలన్నీ చేశా. ఆల్కహాల్ సేవించడం ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అయితే కొంత మంది నటులున్నారు... తాగితేనే అలాంటి క్యారెక్టర్లు చేయగలమనుకునేవారు. కానీ అలా నటించినంత మాత్రాన సీను రక్తి కట్టదు’ అన్నాడు అమితాబ్!