
సాక్షి, హైదరాబాద్: రాజధాని వాసులకు ఆరోగ్య, ఆహ్లాదకరమైన వాతావరణం అందించడానికి ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. ఇందుకోసం అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని ఆయన కోరారు. వాటి అభివృద్ధిలో పౌరులకు భాగస్వామ్యం కల్పించాలని కోరారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషితో కలసి అటవీ శాఖ అధికారులతో సమావేశమయ్యారు.
కేబీఆర్ పార్కులో వాక్ వేలను రూపొందించినట్లుగా మూసీ రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేయలన్నారు. వీటికి అయ్యే ఖర్చులను స్వచ్ఛంద, కార్పొరేటు సంస్థల నుంచి సమీకరించుకోవాలని చెప్పారు. ఓఆర్‌ఆర్ వెంట ప్రతి 10 కిలో మీటర్లకు పూల మొక్కలు నాటాలని, హెరిటేజ్ రాక్స్‌ను గుర్తించి వాటి సమీప ప్రాంతాలను పర్యాటక స్థలాలుగా రూపొందించాలని కోరారు. ఈ సమావేశంలో అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, పర్యాటక కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.