సీఎం సంతకాలు చేసినా వెలువడని అధికారిక ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్న మల్లన్నసాగర్ రిజర్వాయర్‌కు కేబినెట్ పచ్చజెండా ఊపి, సీఎం సంతకాలు చేసినా.. ఇంతవరకు పరిపాలన అనుమతులు మాత్రం లభించలేదు. కాళేశ్వరం రిజర్వాయర్లతోపాటు ఓకే చేసిన దేవాదుల, ఎస్సారెస్పీ స్టేజ్–2, కంతనపల్లి పనులకు అధికారిక ఉత్తర్వులు వెలువడగా.. మల్లన్నసాగర్ సహా ప్రాజెక్టులోని ఇతర రిజర్వాయర్లు మాత్రం ఇంకా అనుమతులకోసం ఎదురుచూస్తున్నాయి. కాళేశ్వరంలో రీ ఇంజనీరింగ్‌కు అనుగుణంగా ప్రాజెక్టు రిజర్వాయర్‌ల సామర్థ్యాలను ప్రభుత్వం పెంచగా.. మల్లన్నసాగర్ సహా మరో 4 రిజర్వాయర్‌ల పరిధిలో సవరించిన అంచనాలకు గత నెలలో కేబినెట్ ఓకే చేసింది. మొత్తంగా రూ.10,876 కోట్లతో ఈ ఐదు రిజర్వాయర్‌లు నిర్మించాలని నిర్ణయించింది.
మల్లన్నసాగర్‌ను 50 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టనుండగా, దానికి రూ.7,249.52 కోట్ల కేబినెట్ అంచనా వేసింది. రంగనాయకసాగర్ రూ.496.50 కోట్లు, కొండపోచమ్మ రూ.519.70 కోట్లు, గంధమల రూ.860.25 కోట్లు, బస్వాపూర్ రూ.1,751 కోట్ల అంచనాలకు ఆమోదం తెలిపింది. తర్వాత సీఎం కూడా సంతకాలు చేశారు. అయితే ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు మాత్రం రాలేదు. ప్రాజెక్టు కార్పోరేషన్‌కు సంబంధించి రుణాల మంజూరు ప్రక్రియ జరుగుతుండటం, భూసేకరణ అంశాలు కొలిక్కిరాకపోవడం వల్లే పరిపాలన అనుమతుల్లో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం.
13 లక్షల ఆయకట్టుకు కీలకం...
కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్నసాగర్ రిజ్వాయర్ కీలకంగా మారింది. ఈ రిజర్వాయర్ కింద మెదక్ జిల్లాలో 5 లక్షల ఎకరాల ఆయకట్టును నిర్ణయించారు. అలాగే ఇక్కడి నుంచి నల్లగొండ జిల్లాలోని గంధమల, బస్వాపూర్‌లకు లింకేజీ ఉంది. మరోవైపు కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో నిర్మించనున్న ఏడు రిజర్వాయర్‌లకు మల్లన్నసాగర్ నుంచే నీటి తరలించే ప్రణాళిక వేశారు. సింగూరు ప్రాజెక్టుకు నీరు, నిజాంసాగర్ ఆయకట్టు స్థిరీకరణకూ ఈ రిజర్వాయర్ నుంచే నీరు సరఫరా చేయాలని నిర్ణయించారు. మొత్తంగా 13 లక్షల ఆయకట్టుకు నీరందించేందుకు మల్లన్నసాగరే ప్రధానంగా ఉంది.
‘మల్లన్న’ ఎదురుచూపులు!
Published Sat, Feb 25 2017 2:10 AM | Last Updated on Wed, Sep 18 2019 2:56 PM
Advertisement