సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో కొనసాగిస్తున్న కొన్ని పాత విధానాలకు స్వస్తి పలుకుతున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో మండలి చైర్మన్ ప్రశ్న సంఖ్య ప్రకటించగానే, ఆ ప్రశ్న వేసిన సభ్యుడు లేచి ‘ఐ పుట్ ది క్వశ్చన్’అని చెప్పి కూర్చోవాల్సి ఉంటుంది. అనంతరం సంబంధిత మంత్రి సమాధానం చెప్పాలని చైర్మన్ పేర్కొన్నాక మంత్రి సమాధానం కొనసాగిస్తారు. ఈ సంప్రదాయంపై బుధవారం నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు లేవనెత్తారు.
‘‘ప్రతి సభ్యుడు లేచి ‘ఐ పుట్ ది క్వశ్చన్’’అని లేచి చెప్పి కూర్చునే పద్ధతితో కాలయాపన జరుగుతోంది. ఈ పద్ధతి శాసనసభలో లేదు. ప్రశ్న సంఖ్య చెప్పగానే నేరుగా సంబంధిత మంత్రి సమాధానం చెబితే సమయం ఆదా అవుతుంది కదా.. పరిశీలించండి’’అని చైర్మన్ దృష్టికి తెచ్చారు. దీంతో తర్వాతి ప్రశ్న నుంచి ఆ విధానాన్ని పక్కన పెట్టి నేరుగా మంత్రి సమాధానమివ్వటం ప్రారంభించారు.
చైర్మన్ బెల్ నొక్కారు.. మంత్రి కూర్చున్నారు..
సాధారణంగా సభ్యులు సమయానికి మించి ఎక్కువసేపు మాట్లాడితే స్పీకర్ బెల్ నొక్కి ముగించాల్సిందిగా సూచిస్తారు. బుధవారం మండలిలో ఈ బెల్ వ్యవహారం కాస్త అయోమయానికి కారణమైంది. నీటిపారుదల శాఖకు సంబంధించి పలు ప్రశ్నలకు మంత్రి హరీశ్‌రావు సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. ఈ సమయంలో చైర్మన్ బెల్ నొక్కారు. దీంతో మంత్రి తన సమాధానం ముగించి కూర్చున్నారు.
అయితే తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాలేదంటూ సభ్యులు పేర్కొనటంతో సమాధానం చెబితే బాగుంటుందన్నట్లు హరీశ్ వైపు చైర్మన్ చూశారు. దీంతో ‘మీరు బెల్ నొక్కేసరికి కూర్చున్నాను’అని మంత్రి పేర్కొన్నారు. కొందరు సభ్యులు ముచ్చట్లు పెడుతుండటంతో వారించేందుకు బెల్ నొక్కానని, మంత్రిని ఉద్దేశించి కాదని చైర్మన్ చెప్పడంతో మళ్లీ మంత్రి లేచి పూర్తి సమాధానం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment