ఫ్యాన్సీ నెంబర్లపై అదే క్రేజ్
నచ్చిన నెంబర్ కోసం రూ.లక్షలు
ఒక్క రోజే రూ.8.71 లక్షల ఆదాయం
సిటీబ్యూరో : ఖరీదైన వాహనాలతో పాటే నగరంలో ఆకర్షణీయమైన ఫ్యాన్సీ నెంబర్లకు సైతం క్రేజీ పెరిగింది. నచ్చిన నెంబర్ల కోసం వాహనదారులు రూ. లక్షలు వెచ్చిస్తున్నారు. సామాజిక హోదాకు, అదృష్టానికి ప్రతీకగా భావిస్తూ ఫ్యాన్సీ , లక్కీ నెంబర్ల కోసం పోటీపడుతున్నారు. గురువారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో వాహనాల నెంబర్లకు జరిగిన వేలంలో కాసులు కురిశాయి.‘టీఎస్ 09 ఇజే 0909’ నెంబర్ కోసం ఆదిత్య అండ్ కో అనే సంస్థ తమ బిఎండబ్ల్యూ కారు కోసం రూ.2.09 లక్షలు చెల్లించి నెంబర్‌ను సొంతం చేసుకుంది. అఖిల్ ఇంటర్నేషనల్ అనే మరో సంస్థ తమ వోల్వో కారు కోసం వేలంలో రూ.2.05 లక్షలు చెల్లించి ‘టీఎస్ ఇజె 999’ నెంబర్‌ను దక్కించుకున్నారు. రూ.15.35 లక్షల ఖరీదు చేసే హార్లీడేవిడ్‌సన్ బైక్ కోసం కృష్ణకుమార్ అనే వ్యక్తి ఏకంగా రూ.1.48 లక్షలు చెల్లించి ‘టీఎస్ 09 ఇజె 1111’ నెంబర్‌ను సొంతం చేసుకున్నారు. మొత్తంగా గురువారం ఒక్క రోజే అన్ని నెంబర్లపైన రూ.8.71 లక్షల ఆదాయం లభించింది.
ఆ ఒక్క నెంబర్ ఉండాల్సిందే...
నగరంలోని ఇతర ప్రాంతాల కంటే ఖైరతాబాద్ ఆర్టీఏ పరిధిలోనే ఫ్యాన్సీ నెంబర్‌లకు పోటీ ఎక్కువగా ఉండడం గమనార్హం. ఎక్కడా లేని విధంగా ఖైరతాబాద్ నెంబర్ ‘టీఎస్ 09’తో మొదలు కావడం, ప్రతి ఒక్కరు ‘9’ నెంబర్‌ను ప్రతిష్టాత్మకంగా భావించడంతో రోజురోజుకు పోటీ పెరుగుతోంది. దీంతో రవాణాశాఖకు ఏటా రూ.కోట్లల్లో ఆదాయం లభిస్తుంది. ‘9999’ వంటి నెంబర్ల కోసం వాహనదారులు రూ.లక్షలు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. గడిచిన ఏడాది కాలంలో నగరంలో సుమారు 5 వేల హైఎండ్ వాహనాల విక్రయాలు జరిగాయి. బీఎండబ్ల్యూ,ఆడి,వోల్వో, రోల్స్‌రాయిస్, హార్లీ వంటి ఖరీదైన వాహనాలను కొనుగోలు చేసే వాహనదారులు తమ హోదాకు తగిన విధంగా ఫ్యాన్సీ నెంబర్‌ల కోసం పోటీపడుతున్నారు. ఈ మేరకు ఒక్క ఖైరతాబాద్ ఆర్టీఏ పరిధిలోనే ఏటా రూ.5 నుంచి రూ.8 కోట్ల ఆదాయం లభిస్తుంది.
ఫ్యాన్సీ నెంబర్లపై అదే క్రేజ్ ( 0909 @రూ. 2.09 లక్షలు)
Published Fri, Oct 30 2015 1:59 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM
Advertisement
Advertisement