పోరాటమే పరిష్కారం | Fight with government is only the solution | Sakshi
Sakshi News home page

పోరాటమే పరిష్కారం

Published Wed, Jan 4 2017 2:38 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Fight with government is only the solution

ఉద్యమంతో రీయింబర్స్‌మెంట్‌ నిధులు సాధించుకుందాం
రెండేళ్లుగా నిధులివ్వకపోవడంతో కాలేజీలు మూతబడుతున్నాయి
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు ఆందోళనలో పడింది
ప్రైవేటు విద్యాసంస్థల సమాఖ్య సదస్సులో ప్రొఫెసర్లు, రాజకీయ నేతలు



సాక్షి, హైదరాబాద్‌: ‘వినతులు.. లేఖలకు ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేదు. అత్యంత ప్రాధాన్యమైన విద్యా రంగాన్ని ప్రభుత్వం సంక్షోభంలో పడేసింది. ఏళ్లుగా విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు ఇవ్వకుండా జాప్యం చేస్తూ ప్రైవేటు విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తోంది. మౌలిక వసతులు, సిబ్బందిని నియమించకుండా ప్రభుత్వ విద్యాసంస్థలను దిగజార్చుతోంది. పోరాడి సాధించుకున్న తెలంగాణలో పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఇక ఊరుకునే ప్రసక్తే లేదు. క్షేత్రస్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేయాలి. అందుకు విద్యాసంస్థల యాజమాన్యాలకు తోడుగా విద్యార్థులును భాగస్వామ్యం చేయాలి.

ఈ ఉద్యమానికి రాజకీయ పక్షాలు సైతం మద్దతిస్తున్నాయి. పోరాటమే మనముందున్న పరిష్కారం’అని ప్రొఫెసర్లు, రాజకీయ నేతలు, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు నిర్ణయించాయి. ఇందుకు సంబంధించి త్వరలో కార్యాచరణ ప్రకటించనున్నట్లు స్పష్టం చేశాయి. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రైవేటు విద్యా సంస్థల సమాఖ్య చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఈ చర్చకు ముఖ్య అథితిగా హాజరైన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘మూడేళ్ల ప్రభుత్వ బడ్జెట్‌ దాదాపు రూ.3.45 లక్షల కోట్లు. వీటిలో నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.4,411 కోట్లు విడుదల చేయలేకపోవడంలో అంతర్యం ఏమిటి? ఆర్థిక పరంగా ప్రభుత్వానికి ఇబ్బందులున్నాయా? లేక ఉద్దేశ్యపూర్వకంగా విద్యార్థులను, యాజమాన్యాలను ఇబ్బందులకు గురిచేస్తుందా?’అని ప్రశ్నించారు.

మిషన్‌ భగీరథ కోసంవేల కోట్లు విడుదల చేస్తున్న ప్రభుత్వానికి ఈ బకాయిలు లెక్క కాదని, చిత్తశుద్ధి లేకనే వీటిని అట్టిపెట్టుకుందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రైవేటు విద్యాసంస్థలను దిక్కుమాలినవని అనడం గర్హనీయమని, వాటిలో కనీస వసతులు లేకుంటే అనుమతులు రద్దు చేయాలని, అది చేతకాక ప్రభుత్వం అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. బుధవారం అసెంబ్లీలో రీయింబర్స్‌మెంట్‌ సమస్యను లేవనెత్తి.. సుదీర్ఘ చర్చకు ప్రయత్నిస్తానని చెప్పారు.  

ఫిబ్రవరి 2న ఇందిరా పార్కు వద్ద ఆందోళన: చాడ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు బకాయి పడిందని, ఏ వర్గానికీ పూర్తి న్యాయం చేయలేదన్నారు. బకాయిలను కప్పిపుచ్చుకునేందుకే బంగారు తెలంగాణ నినాదం ఎత్తుకుందని విమర్శించారు. వచ్చే నెల 2న విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌ వద్ద రీయింబర్స్‌మెంట్‌పై ఆందోళన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి ఇంట్లో నల్లా కనెక్షన్‌ ఉందని, మిషన్‌ భగీరథ అంటూ కమిషన్‌ వచ్చే కాంట్రాక్టు పనులకు ప్రాధాన్యత ఇస్తూ పేద విద్యార్థుల చదువును తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య మం డిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికీ ఇక్కడి ప్రజల బతుకుల్లో ఏమాత్రం మార్పు రాలేదని, ఆంధ్రా పాలకులు అనుసరించిన విధానాలనే తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తోందని మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య ఆరోపించారు. కార్యక్రమంలో ప్రైవేటు విద్యా సంస్థల సమాఖ్య కన్వీనర్‌ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేట్‌ విద్యా సంస్థలకు ప్రభుత్వ రక్షణ: కోదండరాం
టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం మాట్లాడు తూ.. రాష్ట్రంలో కార్పొరేట్‌ విద్యాసంస్థల కు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం వ్యవహ రిస్తోందని, వాటి నుంచి ముడుపులు తీసుకుని రక్షణ కల్పిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో అస్తవ్యస్తమైన పరిస్థితి నెలకొందని, సమస్యను ఎవరికి చెప్పాలో తెలియని దుస్థితిలో మనం ఉన్నామని, దీంతో అసెంబ్లీలో చర్చించడమే పరిష్కార మార్గమని భావిస్తున్నారని, రీయింబర్స్‌ మెంట్‌ బకాయిలపై శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీయాలని ఎమ్మెల్యేలను కోరారు. ‘సమస్యలున్నప్పటికీ ప్రజలంతా ఓపికతో ఉన్నారు. ఒక రోజు తప్పకుండా ఓపిక నశిస్తుంది. అప్పుడు తెగించి పోరాడడమే మిగులుతుంది. ఆ పరిస్థితి వస్తే ప్రజలను ఆపడం అసాధ్యం’అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement