అక్రమార్కుల కోసమే ‘మీ సేవ’
- ఉద్యోగ నియామకాల్లో పైరవీలకు పెద్దపీట
- దరఖాస్తు చేయని అభ్యర్థులకూ ఇంటర్వ్యూలు
- విచారణకు నిరుద్యోగ జేఏసీ నేతల డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఆన్‌లైన్ సేవల కోసం ఉద్దేశించిన మీ సేవా ఉద్యోగ నియామకాల ప్రక్రియ అక్రమాలకు నెలవుగా మారింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 21 జిల్లాల్లో ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ల నియామకం కోసం ఆన్‌లైన్ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం, దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే స్వీకరించింది. ఇందు కోసం స్థానికులు, ఆన్‌లైన్ సర్వీసు సంస్థ లు, కేంద్రాల్లో రెండేళ్లు పనిచేసిన అనుభవం, పలు విద్యార్హతలను నిర్దేశించింది. కానీ గడిచిన మూడు రోజులుగా హైదరాబాద్‌లోని మీ సేవా డైరెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు దరఖాస్తు చేయని వారిని పిలవటం, భర్తీ ముందే జరిగిపోయిందంటూ అక్కడి సిబ్బంది పేర్కొంటుం డడంతో నిరుద్యోగులు నిరాశతో పాటు ఆశ్చర్యానికి లోనవుతున్నారు.
పిలిచిన వారిలో దరఖాస్తు చేయని వారే అధికంగా ఉండటం.. అక్ర మాలకు తావి స్తోంది. రెండు రోజుల క్రితం జనగామ జిలా ్లకు జరిగిన ఇంటర్వూ్యకు దరఖాస్తు చేయని అభ్యర్థిని నేరుగా ఆహ్వానించారు. అలాగే భూపాలపల్లి, జగిత్యాల, ఆసిఫాబాద్, గద్వాల జిల్లాలకు సంబంధించి అడ్డదారుల్లో వచ్చిన అభ్య ర్థుల కు పెద్దపీఠ వేశారని సమాచారం. ఇదిలా ఉంటే విద్యార్హత, ప్రతిభ, పనిచేసిన అనుభవం ఆధారంగా రోస్టర్ పద్దతిన ఎంపిక చేయాల్సి ఉండగా, ‘అధికార’సిఫారసుల ఆధారంగా చేస్తున్న తీరుపై నిరసన వ్యక్తం చేయాలని నిరుద్యోగ జేఏసీ నిర్ణయించింది. సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు తీసుకుని ఈ నియామకాల వెనుక భారీగా అక్రమాలను వెలికితీస్తామని నాయకులు మానవతారాయ్, కళ్యాణ్‌లు తెలిపారు. ఈ విషయమై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, టీడీఎల్పీ నేత రేవంత్‌రెడ్డిలకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
ఇంటర్వ్యూ చేయడం లేదంటూ....
ఈ డిస్ట్రిక్ మేనేజర్ పోస్టుల ఇంటర్వ్యూ వ్యవహారం గురించి ‘సాక్షి’మీ సేవ కమిషనర్ కార్యాలయ అధికారులను సంప్రదించగా.. తొలుత ఇంటర్వ్యూలు ప్రారంభం కాలేదని.. ఒక వారంలో మొదలవుతాయన్నారు. ఇంటర్వ్యూలు జరిగిన మాట వాస్తవమేనని మీసేవ కమిషనర్ కార్యాలయ ఉద్యోగి ఒకరు సమాధానం ఇవ్వడం గమనార్హం.