ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం
సేకరణ కేంద్రాల వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలి
ఇన్‌చార్జి మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
రైతు పండగను కలెక్టర్లు విజయవంతం చేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం సేకరణను త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లతో పాటు పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. రైతుల నుంచి ధాన్యం సేకరణ సజావుగా సాగేలా పర్యవేక్షించేందుకు జిల్లాల వారీగా నియమితులైన ఇన్‌చార్జి మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం..మంగళవారం పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ నుంచి మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు, చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.
సన్న, దొడ్డు రకాలను వేరువేరుగా సేకరించాలని, ధాన్యం విక్రయించిన రైతుకు చెల్లింపులు వెంటనే పూర్తి చేయాలని, సన్న రకాలకు బోనస్ కూడా త్వరగా చెల్లించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్నిరకాల మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఉమ్మడి జిల్లాల వారీగా ప్రతిరోజూ నివేదిక సమరి్పంచాలని ఆదేశించారు.
అక్రమాలకు పాల్పడే మిల్లర్లను ఉపేక్షించొద్దు
అక్రమాలకు పాల్పడే మిల్లర్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని, కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు రవాణా సమస్యలు తలెత్తకుండా తగినన్ని లారీలు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. సన్నాలకు బోనస్‌గా క్వింటాల్‌కు రూ.500 చెల్లిస్తుండడంపై రైతులు ఆనందంతో ఉన్నారని సీఎం వ్యాఖ్యానించారు.
’రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల్లో ధాన్యం పండించారు. ఇంకా 20 లక్షల ఎకరాల్లో పంట కోయాల్సి ఉంది. సరిహద్దు జిల్లాల్లో నుంచి బోనస్ కోసం ధాన్యం రాష్ట్రంలోకి వస్తోంది. ఆ ధాన్యం విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. 30న మహబూబ్‌నగర్‌లో రైతు పండగను జరుపబోతున్నాం. దీన్ని కలెక్టర్లు విజయవంతం చేయాలి’ అని సీఎం కోరారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అందిస్తున్న సౌకర్యాలపై ప్రజల్లో ప్రచారం చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment